భయం.. హుష్ కాకి

‘అమ్మా నేనింటికి వచ్చేస్తా .. రాత్రి దొంగలు వచ్చారు.  నాకు భయమేస్తోంది’  ఏడుస్తూ గొడవ చేస్తోంది సోని.

కూతురికి ఎట్లాగయినా నచ్చచెప్పాలని ప్రయత్నిస్తోంది సోని తల్లి యాదమ్మ.

యాదమ్మది పక్కనుండే పల్లె.  కొడుకునీ కూతురినీ సాంఘిక సంక్షేమశాఖవారి హాస్టల్ లో ఉంచి చదివిస్తోంది. అంగడికి వచ్చిన ప్రతిసారీ రాకపోయినా రెండుమూడు వారాలకోకసారయినా కూతురు దగ్గరకి వస్తుంది.  ఎప్పటిలాగే చూద్దామని వచ్చిన యాదమ్మకి కూతురు మాటలు కంగారు పుట్టించాయి. ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు.

‘అవునాంటి రాత్రి దొంగలొచ్చారు.. ‘ చెప్పారు మిగతా పిల్లలు.

‘హాస్టల్ లో ఏమున్నాయని దొంగలోస్తారు ..?’ తేరుకుంటూ అంది యాదమ్మ.

‘రాత్రి మా రూం తలుపు తీసి టార్చ్ లైట్ వేసి చూస్తున్నారు. నేనూ చూశా .. ‘చెప్పింది కనక.

‘కుక్కలు మొరిగినాయ్ .. మెట్లు దిగి దనదనా పోయిన చప్పుడయింది’ అంది లలిత.

‘నాకయితే గజ్జెల చప్పుడు కూడా వినొచ్చింది’ అంది మంజుల.  ‘అవును నేనూ విన్నా’ అంటూ మరో ఇద్దరు చెప్పారు.

‘నాకయితే మస్తు భయమయింది. ముసుగు తీయలే..’ కోమలి

తలో మాట చెప్తుండగా వార్డెన్ రాజశ్రీ వాళ్ళదగ్గరకి వచ్చింది.

‘పిల్లలంతా భయపడుతున్నరు మేడం.. దొంగలోచ్చారట గద ..’ సందేహిస్తూ అడిగింది యాదమ్మ.

‘అదేం లేదు యాదమ్మా .. అదంతా వాళ్ళ భ్రమ..’ అంటూ కొట్టిపారేసింది. తనతో వాళ్ళనీ రమ్మంది రాజశ్రీ.

‘అదేంటమ్మా పిల్లంతా అట్లా భయపడుతుంటే ..’అంటూనే యాదమ్మతను కూడా ముందుకు అడుగేసింది.

అంతా మొదటి అంతస్తులో దొంగాలోచ్చారంటూన్న రూమ్ కేసి వార్డెన్ తో పాటే.  ఆ వెనకే అక్కడున్న పిల్లలంతా . వారితో పాటే యాదమ్మ.

 

‘అటు చూడండి ఆ చెట్టు కాయలు. అవి  గాలికి కదులుతోంటే ఎలా వినిపిస్తోంది..?” పిల్లందరినీ చూస్తూ ప్రశ్నించింది రాజశ్రీ.   శ్రద్దగా ఆలకించిన  కోమలి ‘మేడం, గజ్జెల చప్పుడు లాగా .. అనిపిస్తోంది ‘ అంది

‘నిన్న పగలు జ్వరం వచ్చిందని మల్లిక బడి నుండి వచ్చేసింది కదా.  ఆమెకు తోడు ఎవరోచ్చారు ..? నువ్వే కద జయా ‘  అప్పుడే తల స్నానం చేసివచ్చి తల తుడుచుకుంటున్న జయని చూస్తూ.

‘అవును మేడం, అప్పుడు జ్వరంతో ఉన్న మల్లిక వాంతి చేసుకుంది’  చెప్పింది జయ

‘అప్పుడు ఏ తలుపు తీసావ్ జయా?’ అని అడిగింది.

‘ఈ తలుపు  తీసి అక్కడంతా కడిగి తలుపువేసాను’  అంది తలుపు చూపుతూ

‘లోపల గడియ పెట్టావా..?’

‘ ఏమో మేడం, పెట్టినట్టు గుర్తు లేదు’ అంది తల తుడవడం ఆపి జుట్టును అలా వదిలేసిన జయ.

‘రోజూ ఆ తలుపు తెరవనే తెరవం కదా ..ఎప్పుడూ మూసి  ఉండే తలుపు అది. దగ్గరకు వేసి ఉన్న తలుపు రాత్రిపూట గాలికి కొద్ది కొద్దిగా తెరుచుకుంటూ మూసుకుంటూ ఉంది.  ఆ పక్కనే వెలుగుతున్న లైటు వెలుతురు చెట్టుకొమ్మ మీదుగా పడ్డం చూసి టార్చి లైటు అని భ్రమపడ్డారు.  అంతే .. ఈ పిల్లల దగ్గరకి దొంగ లెందుకు వస్తారు ..? ‘  విడమర్చి చెప్పింది రాజశ్రీ.

నిజంగా దొంగలు రాలేదా .. అని కొందరు ఆలోచిస్తుంటే ‘కాదు మేడం ఆ డాబా మీద ఏదో పగిలినట్లు దన్ చప్పుడయింది’ అంది ఒకమ్మాయి.  ‘సరే పదండి పైకి వెళ్లి చూద్దాం ..’ అంది రాజశ్రీ

‘మేడం చూడండి ‘ అంటూ అరిచారు ఇదరు పిల్లలు.

అక్కడ పనికిరాని ట్యూబ్ లైట్లు ఓ మూలకు ఎప్పటి నుండో పెట్టి ఉన్నాయి. అవి పగిలిన ముక్కలు కనిపిస్తున్నాయి.  వాటికి కొద్దిగా ఆవలగా కోతుల మల మూత్రాలు ఆరోజే చేసినట్లుగా ..

‘చూశారా వీటిని పడేసింది కోతులు.  మీకు తెలిసిందే కదా .. మీరు పడేసే అన్నం కోసం ఈ చింత చెట్టు మీద కోతులున్న సంగతి. నవ్వుతూ అంది వార్డెన్.

అయినా .. ఒక వేళ దొంగలే గనక వస్తే ..  ఇంతమందిమి ఉన్నాం. వారిని ఎదుర్కోలేమా .. ఏమర్రా .. ఆ దొంగను పట్టుకుని నాలుగు తన్నలేమా..?’ పిల్లలవైపు చూస్తూ ప్రశ్నించింది రాజశ్రీ.

‘ఇదిగో ఈ దుడ్డుకర్ర తో ఒక్కటిస్తే ..’ గీత యాక్షన్తో అన్న తీరుకు అంతా నవ్వారు.

‘అవును గీతా, ఆ ధైర్యం కావాలి భయపడడం కాదు .. అలా ఎందుకు జరిగిందో ఆలోచించాలి. విషయం ఏమిటో తెలుసుకోవాలి. అదేమీ చేయకుండా భయపడి ఇంటికి పొతే నష్టపోయేది ఎవరు? ‘ అందరినీ కలియజూస్తూ గీత భుజం తట్టి మెచ్చుకుంది వార్డెన్.

‘ఆ.. అవును మేడం నిజంగా దొంగలు వచ్చినా ఇడిచి పోతామా .. ఇంట్లో దొంగలు పడితే ఇల్లు ఇడిచి పోతున్నామా ..?’ సాలోచనగా  యాదమ్మ

అవును నిజమేనన్నట్లుగా పిల్లల మొఖాలు భయం పోయి విప్పారుతుండగా ‘భయం.. హుష్ కాకి ‘ అంది సోని ఆక్షన్ తో .

అంతా హుష్..  హుష్ .. అంటూ నవ్వుల పువ్వులయ్యారు.

వి. శాంతిప్రబోధ

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

3 thoughts on “భయం.. హుష్ కాకి

  • August 28, 2015 at 10:27 am
    Permalink

    muundu naaku baiyangayundede ye khada chadivina taruvata naa bhayam hus kaki

  • November 16, 2015 at 10:13 am
    Permalink

    mi bhayam hush kaaki ayinanduku santhosham k. Rajkumar and Sindhu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *