మంత్రం

“మనస్వినీ  టిఫిన్ చేద్దువుగాని రామ్మా” అని కేకేసింది సరళ.

“వస్తున్నానమ్మా ” అంటూ బదులిచ్చింది అప్పుడే బడి నించి వచ్చి కాళ్ళూ చేతులూ కడుక్కుంటున్న మనస్విని  .

గుంటూరులోని  ఒక బాలికల ఉన్నత పాఠశాలలో మనస్విని  ఇప్పుడు  తొమ్మిదవ  తరగతి  చదువుతోంది.

“అమ్మా ! నాన్న ఎప్పుడు వస్తారు? ” అని అడిగింది మనస్విని.  మనస్విని వాళ్ళ నాన్నగారు వ్యాపార నిమిత్తమై ఊరుకి వెళ్ళి రెండురోజులయింది.

“రేపు సాయంత్రం వస్తారమ్మా , ఈ సారి  మీ నాన్నగారితో పాటు  పెదనాన్న  కూడా  వస్తున్నారుట ” అంది  సరళ.

“హేయ్ ! నిజంగానా! మరి పెద్దమ్మ రావటంలేదా?” అడిగింది  మనస్విని.

“లేదమ్మా ,  స్కూలులో ఏదో అత్యవసరమైన తనిఖీ (Inspection)  ఉందని  పెద్దమ్మకి సెలవు దొరకలేదుట . అందుకని  రావటం లేదుట”  అంది  సరళ.

మనస్విని  వాళ్ళ పెద్దమ్మ  ఒక  బడిలో ప్రధానోపాధ్యాయినిగా  పనిచేస్తున్నారు.  పెదనాన్నది వ్యాపారం.

మనస్వినికి వాళ్ళ పెద్దమ్మ ,  పెదనాన్న  అంటే ఎంతో ఇష్టం , అలాగే వాళ్ళకి కూడా మనస్విని  అంటే  ప్రాణం.  వాళ్ళకంటూ సంతానం లేకపోవటంతో  మనస్విని నే  తమ కన్నకూతురిగ చూసుకుంటారు.  కనీసం  ఆరునెలలకి ఒకసారైన వచ్చి మనస్విని ని చూడందే వాళ్ళకి తోచదు. పెదనాన్నైతే  దగ్గర కూర్చుని మనస్విని  బడిలోని విశేషాలన్నీ అడిగి తెలుసుకుంటారు, అంతే కాకుండా పాఠాలు ఎలాచెప్తున్నారూ, ఏమేమి పాఠ్యాంశాలు ఉన్నాయీ, పరీక్షలు ఎప్పుడూ…………..ఇత్యాది విషయాలన్నీ మనస్విని తో ముచ్చటిస్తుంటారు కూడా.  అందుకే పెదనాన్న వస్తున్నారంటే  మనస్వినికి  అంత  సంతోషంగా  ఉంది.

మర్నాడు సాయంత్రం మనస్విని  ఇంటికి వచ్చేటప్పటికి పెదనాన్న వచ్చి ఉన్నారు. ఆయనని చూడగానే “పెదనాన్నా” అంటూ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి

“అమ్మా! నాన్నేరీ?” అని అడిగింది మనస్విని  అమ్మ  సరళని.

“నాన్న  ఇప్పుడే  బజారుకి  వెళ్ళారమ్మా!”  అంది  సరళ.

ఇంతలో  “మనస్వినీ , ఇవిగో  నీకోసం  పెద్దమ్మ  సున్నుండలు  పంపింది”  అంటూ డబ్బా మనస్వినికి ఇచ్చారు  పెదనాన్న.

“పెద్దమ్మకి  థ్యాంక్స్  చెప్పండి  పెదనాన్నా! ”  అంటూ  గబగబా డబ్బా తెరిచి రెండు సున్నుండలు తినేసింది మనస్విని .

మనస్వినికి పెద్దమ్మ చేసిన సున్నుండలు అంటే  మహా ఇష్టం.  వచ్చినప్పుడల్లా మనస్విని  కోసమని ఏదో  ఒకటి తేవటం లేదా ఎవరైనా వాళ్ళ ఊరునుంచి అటుగా వస్తుంటే వాళ్ళతో పంపటం చేస్తుంటారు.  కాసేపు అక్కడే కూర్చుని పెదనాన్నతో సరదాగ కబుర్లు చెప్పాక   హోంవర్క్  చేసుకోవటానికి  తన  గదిలోకి వచ్చేసింది  మనస్విని .

మర్నాడు సాంఘిక శాస్త్రంలో (సోషల్  స్టడీస్) క్లాస్  పరీక్ష ఉందని చదువుకుంటోంది మనస్విని . సాంఘిక శాస్త్రం అంటే మనస్విని కి దడ!!!!  ఎంత చదివినా తలకెక్కదు.

“నా  స్నేహితులలో చాలామంది బట్టీ కోట్టి రాసేస్తారు కానీ నాకేమో  బట్టీ కొట్టటం చేతకాదు. అర్థంచేసుకుని చదివితేకానీ తిరిగి రాయలేను .  ఈ సబ్జక్టు అంతా అర్థమయినట్లే ఉంటుంది తీరా రాసేటప్పుడు ఏమీ గుర్తుకు రాదు.  ఈ పాఠంలో  పది ప్రశ్నలున్నాయి. అన్నీ పెద్ద పెద్ద జవాబులున్నవే “‘ అనుకుంటూ కొంచం తలనెప్పిగా అనిపించి తల నొక్కుకుంటుండగా  మనస్విని  గదిలోకి వచ్చారు పెదనాన్న.

“రండి పెదనాన్నా “ అంది మనస్విని  చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి .

“ఏమ్మా తలనెప్పిగా ఉందా?” అని అడిగారు ఆయన.

“అవును పెదనాన్నా! సాంఘిక శాస్త్రంలో రేపు క్లాస్ పరీక్ష . ఈ  పాఠం  ఎన్నిసార్లు చదివినా తలకెక్కటంలేదు.” అంది మనస్విని.

“ అవునా? అయితే నేనొక ఉపాయం చెప్తాను విను  “ఒక్కొక్క సారి పది సార్లు చదివినా రానిది ఒక సారి చూసి వ్రాసి తరవాత చదివితే త్వరగా వచ్చేస్తుంది” , ఇది ఒక “మంత్రం”  లాంటిది.  ప్రయత్నించి చూడటంలో తప్పులేదుగా? ఇది పనిచేసినట్లనిపిస్తే  నీకు  సమయంకూడా  కలిసి వస్తుంది  “ అని   మనస్విని కి  “గుడ్ నైట్”  చెప్పి వెళ్ళిపోయారు.

ఆయన మాట కాదనలేక  “సరే పెదనాన్న“ అందే కానీ అప్పటికే రాత్రి తొమ్మిదవటంతో పెదనాన్న చెప్పిన ఉపాయం  ఇంకొక సారి అమలు చేద్దామని  ఇప్పటికి మళ్ళీ ఇంకొక సారి చదువుదామని  పుస్తకం చేతిలోకి తీసుకుంది.

కాసేపటి తరువాత “ఊహూ! లాభంలేదు తలకెక్కటంలేదు. పోనీ పెదనాన్న చెప్పినట్లు  చేసి చూస్తేనో? ఆయన ఎప్పుడు  ఇలాంటి ఉపాయాలు చెప్పినా  నాకు  లాభించింది.  పైగా ఇది ఒక  “మంత్రం” లాంటిది అని కూడా పదే – పదే చెప్పారు. కానీ అన్నీ రాసి  చూడాలంటే సమయం చాలదు” అనుకుంటూ ఉన్న  ప్రశ్నల్లోంచి మిగతా అన్నిటికంటే ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నవి  నాలుగు ఎంచుకుని ఒక నోట్ బుక్ లో ప్రశ్న జవాబులు చూసి వ్రాసింది .  తరువాత  రాసిన వాటిని ఒకసారి తిరిగి చదివింది.

“విచిత్రం“  అప్పటిదాకా కొరకరాని కొయ్యలలా అనిపించిన ఆ నాలుగు జవాబులూ ఇప్పుడు ఎంతో తేలికగా అనిపించాయి.  “ఈ  రహస్యమేమిటి చెప్మా “ అని ఆలోచించగా “ జవాబు చూసి రాసేటప్పుడు నేను  ఆ జవాబు మీద మనసు లగ్నం చేసి రాశాను. అందుకే మళ్ళీ చదువుతున్నప్పుడు  జవాబులన్నీ నాకు  ముందే సుపరిచితంగా  వచ్చినట్లుగా అనిపించాయి. “  అనుకుంది ఆనందంగా.  అంతే,  రెట్టించిన ఉత్సాహంతో ఇంకొంచం సమయం వెచ్చించి మిగతా జవాబులన్నీ అలాగే  రాసి చదివేసి నిశ్చింతగా పడుకుని నిద్రపోయింది మనస్విని .

మర్నాడు సాంఘిక శాస్త్రం క్లాస్ పరీక్షలో మనస్విని దే ఫస్ట్  మార్కు.  ఎప్పుడూ సాంఘిక శాస్త్రం లో పరీక్ష అంటేనే  ఎంతో కలవరపడే మనస్విని  ఈ సారి ప్రశాంతంగా పరీక్ష రాయటమే కాక ఫస్ట్ మార్కులు కూడా తెచ్చుకోవటం చూసి తోటి విద్యార్థులందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. మనస్విని  ఆనందానికి హద్దేలేదు.

ఇంటికి వచ్చి వెంటనే పెదనాన్నకి ఫోన్ చేసి “ థ్యాంక్స్ పెదనాన్నా! మీరు చెప్పిన  ‘ఒకసారి చూసి వ్రాస్తే  పదిసార్లు చదివినంత  ఫలితం’  అన్న మాటలు నిజంగానే ఒక “మంత్రం” లా పని చేశాయి. ఈ సారి నాకు సాంఘిక శాస్త్రంలో క్లాస్ ఫస్ట్ మార్కులు వచ్చాయి” అని చెప్పి “ ఈ విషయం పెద్దమ్మకి కూడా  చెప్పండి ”  అంది  మనస్విని ఆనందంగా.

పెదనాన్న పెద్దమ్మ  కూడా చాలా సంతోషించి మనస్విని కి అభినందనలు తెలిపారు. ఆ తరువాత కూడా మనస్విని  ఆ “మంత్రం” పాటించి ఎంతో కష్టతరమైన పాఠ్యాంశాలని కూడా  సులువుగా అర్థంచేసుకుని చదివి అన్ని  పరీక్షలలోనూ ప్రథమ శ్రేణి మార్కులతో  విజయం సాధించింది.

*****************************

** ప్రియమైన పిల్లలూ !  మీ మీ చదువుకునే విధానాలు వేరైనా , ఏదైనా పాఠ్యాంశం బాగా కష్టమనిపించినప్పుడు ఈ

“మంత్రం” పాటించి చూడండి . మీకు తప్పక లాభిస్తుంది ……..దినవహి సత్యవతి .

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

One thought on “మంత్రం

 • October 1, 2015 at 8:13 am
  Permalink

  సత్యవతి గారూ,
  మీ కథాశైలి అద్భుతం, కథనం అద్భుతం.
  ‘మనస్విని’ అనే మంచిపేరు ఈరోజుల్లో ఎంతమంది పెడుతున్నారు వాళ్ళ పిల్లలకి?
  ఈ పేరు నాకు చాలా నచ్చింది.

  మంచిపేర్లు, మంచి సందేశంతో మీ కథలు చదవడానికి చాలా ఆహ్లాదంగా ఉంటాయి.
  ఇటువంటి మంచి కథలు మాకు అందిస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు.

  సత్యసాయి కొలచిన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *