ఎడమచెయ్యి 

‘నేనే పస్ట్’ అని పరుగెత్తి వచ్చిన ఉత్తమ్ ఆయాసపడుతూ కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న మిత్ర చేయి అందుకున్నాడు

‘అత్తా మేమొచ్చేశాం .. ‘ పరుగు పరుగున లోపలికొస్తూ అన్నాడు వేణు.
వేణు వెనకే  గిరిజ, మాల, విశ్వ, ప్రసాద్ లు లోపలికి వచ్చేశారు. వారి భుజాలకి తగిలించిన చిన్న బ్యాగ్స్.  వాళ్ళంతా మిత్రకి ఇరుగు పొరుగున ఉండే పిల్లలు.  ఆరు, ఏడు తరగతులు చదివే పిల్లలు. ప్రతి ఆదివారం వాళ్ళందరికీ మిత్రతో గడపడం అలవాటు. సరదా సరదా కబుర్లతో పాటు వాళ్ళ మెదళ్ళకు మేత వేస్తుంటుంది మిత్ర.  వాళ్ళతో సమయం గడపడం ఆమెకు చాలా ఇష్టం. ఆ పిల్లలకీ అంతే. వయసు తేడా మరచి స్నేహితుల్లాగా ఉంటారు.

‘అనుకున్నట్లుగానే సరిగ్గా సమయానికి వచ్చారు . గుడ్ ‘ అంది మిత్ర వాళ్ళ సమయపాలనని అభినందిస్తూ

‘అత్తా ఈ రోజు ఏం మేత వేస్తున్నావ్ ‘ నవ్వుతూ అడిగింది మాల.

‘మొన్న కథ అయిపోయిందిగా .. పాట రాద్దామా ..’ విశ్వ

‘ఒద్దురా .. అత్త ఒక పదం ఇస్తుంది . మనం దానిపై రాద్దాం ‘అన్నాడు ప్రసాద్

‘అత్తా.. అవునా పదం ఇస్తావా .. ? త్వరగా ఇవ్వు . నేను రాసి ఇచ్చి వెళ్ళిపోతా ‘ గిరిజ తొందర
‘ఎందుకురా అంత తొందర ‘ మిత్ర ప్రశ్న

‘ఏమి లేదత్తా పోయిన వారం కథ బాగా రాసిందని మెచ్చుకుని దానికి బహుమతి ఇచ్చావ్ గా . అందుకనే దానికి కొమ్ములోచ్చాయి. ఈరోజు అవి ఇంకా పెరుగుతాయనేమో .. ‘ గిరిజనే చూస్తూ కవ్వింపుగా అన్నాడు వేణు

‘ ఒరే నీ సంగతి తర్వాత చెప్తా.. ‘ అంటూ చూపుడు వేలితో బెదిరించి ‘ అదేం కాదత్తా..ఈ రోజు నేను త్వరగా వెళ్ళాలి . మా అన్నయ్య వాళ్ళు బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. నేను వెళ్ళకపోతే నన్ను విడిచి వెళ్ళిపోరూ ‘ కళ్ళు పెద్దవి చేసి చెప్పింది గిరిజ

‘ ఓ . సరే అయితే .. ఈ రోజు మీ పదం “ఎడమ చెయ్యి “. అంటూ ఎడమ చెయ్యి చూపింది మిత్ర

‘చీ ఎడమచేయ్యా ..? దాని గురించి ఏమి రాస్తాం ‘  వెంటనే వేణు ప్రశ్న

‘అవును ఎడమ చెయ్యి గురించే రాయాలి . 20 నిముషాల సమయంలో కనీసం 15 వాక్యాలు రాయాలి. ఇంకా ఎక్కువ రాస్తే సంతోషం ‘ చెప్పింది మిత్ర

అంతా మొహాలు చూసుకున్నారు . ‘ఆ పని తప్ప ఎడమ చెయ్యి ఏం చేస్తుందీ ..’ ఆలోచిస్తున్నట్లుగా మొహం పెట్టిన ప్రసాద్. అంతా ఘొల్లుమని నవ్వారు.

‘ఆలోచించండి. మరో పది నిముషాలు ఇస్తాలే’  అని ఎడమ చేతికున్న వాచీ చూసుకుంటూ ‘ఇప్పుడు మూడు గంటల ఐదు నిముషాలు అయింది. అంటే మూడూ ముప్పైదుకి మీరు నాకిచ్చేయ్యాలి. మీరు రాసిన వాటిలో ఉత్తమమైన దానికి నేనొక చిన్న బహుమతి ఇస్తా .   మీ టైం మొదలయింది.’ అంటూ మరో మాటకు తావివ్వకుండా వెళ్లి తన పుస్తకం అందుకుంది మిత్ర.

అత్త టైం చూసుకోవడంతో ఏదో అర్దమయినట్లు ఉత్తమ్ కళ్ళు మెరిశాయి .  మాల కేదో తెలిసినట్లు ఆమె పెదవులపై చిన్నగా నవ్వు మొలిసింది. కొద్దిక్షణాలు ఆలోచనలో పడ్డ వాళ్ళు నెమ్మదిగా తమ భుజాలకి తగిలిచుకున్న బ్యాగ్ లోంచి నోట్ బుక్ , పెన్ను , పేపర్ తీసుకుని తమకి ఇష్టం ఉన్న చోట కూర్చున్నారు.

మధ్య మధ్యలో వాళ్ళని గమనిస్తున్న మిత్ర మనసులోనే చిన్నగా నవ్వుకుంది. వారి ఏకాగ్రతకి, ఏదో పరీక్షకి సీరియస్ గా అలోచించి రాస్తున్నట్లుగా ఉన్న వారి తీరుకి.

‘అత్తా నాకేమీ రావడం లేదు ‘ మిగతావాళ్ళు రాసేస్తుంటే తనకేమీ రావడం లేదని దిగులుతో విశ్వ.

‘ఏం ఫర్వాలేదులే .. ముందు బాగా ఆలోచించు . ఇంకా ఇరవై నిముషాల సమయం ఉంది . రాయొచ్చు ‘ ధైర్యం చెప్పింది మిత్ర.

ఇంకా ఐదు నిముషాలుండగానే తను రాసింది ఇచ్చేసి ‘అత్తా నేనెళ్ళిపోతున్నా.. బై ‘ అంటూ తుర్రుమంది గిరిజ. అందరిదీ అయిపోయినట్లుగా ఉన్నారు.  టైం అప్ అని అత్తనోట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు.  విశ్వ మాత్రం ఇంకా రాస్తున్నాడు.

టైం అయిపొయింది. అందరి దగ్గరా పేపర్స్ తీసేసుకుంది మిత్ర.  మీరంతా ఒక దగ్గర కూర్చొని ఈ పజిల్ పూర్తి చేయండి అని పని అప్పగించింది.  తను వాళ్ళిచ్చిన పేపర్స్ అందుకుంది.

అందరు రాసినవీ చదివింది మిత్ర.  మిగతా వాళ్ళు  రాసిన దానికి చాలా భిన్నంగా విశ్వ ఆలోచన . చాలా ఆశ్చర్యంగా , విచిత్రంగా, కొత్తగా  అనిపించింది.  ఇంత చిన్న పిల్లవాడు ఎంత అద్భుతంగా  వ్యక్తీకరించాడు.  తానెప్పుడూ అలా ఆలోచించలేదే అనుకుంటూ మళ్ళీ చదవడం మొదలు పెట్టింది మిత్ర.

‘”నాన్నకి ఎడమచేతి వైపున అమ్మ ఉంటుందట. ఎడమ చెయ్యికి చాలా పనులు తెలియవు కదా అట్లాగే అమ్మలకీ తెలియదేమో. నాన్నలకే తెల్సేమో. ఎందుకంటే మా ప్రెండ్స్ చాలామంది ఇంట్లో నాన్న ఉద్యోగం చేసి డబ్బులు తెచ్చి కుటుంబాన్ని పోషిస్తాడు. అమ్మ ఇంట్లో అందరికీ వంట చేసిపెడుతుంది. వాళ్ళు చాలా సార్లు మాటల్లో మా అమ్మకి ఏమీ తెలియదు అంటారు.  గోపీ వాళ్ళ  నాన్న లేడని వాళ్ళమ్మ ఎప్పుడూ ఏడ్పు మొహంతో ఇంట్లోనే కూర్చుంటుంది.   కానీ మా అమ్మ అట్లా కాదు. మా  అమ్మేగా  ఎడమచెయ్యి.  కుడిచెయ్యి .. అవును, మా అమ్మ అందరి ఆడవాళ్ళలా కాదు . అందరి అమ్మల్లాగా మా అమ్మ ఎడమ చెయ్యి ఒక్కటే కాదు కుడి చెయ్యి కూడా.  రెండు చేతులతో అమ్మ పనీ ,నాన్న పనీ చేసేస్తుంది. వంట చేస్తుంది. నాకు అన్నంపెట్టి బడికి పంపుతుంది. ఆఫీసుకు వెళ్తుంది. కారు, బైకు నడిపేస్తుంది. ఒక్కటే ఎక్కడికైనా వెళ్లి రాగలదు. ఎవరితోనైనా చక్కగా మాట్లాడేస్తుంది. దేనికీ భయపడదు.   నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది.

అమ్మని రోజూ చూస్తానే ఉన్నా కదా.  కానీ ఇప్పుడు ఇది రాస్తుంటే అమ్మ చాలా కొత్తగా గొప్పగా కనిపిస్తాంది. ఇప్పుడు నాకనిపిస్తోంది. నేర్చుకుంటే అమ్మలకీ అన్నీ వస్తాయని.  ఏ చెయ్యికి ఏ పని నేర్పితే ఆ పనిచేస్తుందని. నాకు నాన్న లేడుగా..  అందుకే అమ్మే నాన్న కూడా అయింది.  ఎడమచెయ్యే  కుడిచెయ్యిగా అయినట్లుగా.  మరి అమ్మ లేకపొతే నాన్న కూడా అమ్మలాగా రెండు పనులూ అమ్మచేసినంత సులువుగా చేస్తాడా .. ఏమో తెలియదు.  ఆ.. చేస్తాడనే అనిపిస్తోంది. కుడి ఎడమ రెండుచేతులకీ తేడా చూపకుండా పనులు నేర్పిస్తే… .”

ఇంకా టైం ఉంటే ఏం రాసేవాడో అనుకుంటూ చేతిలోని పేపర్లు చూస్తూ పిల్లల్ని పిలిచింది మిత్ర.  ఎవరు రాసింది వారికిస్తూ  ఒకరితర్వాత ఒకరు పైకి చదవండి. అందరూ వింటారు. తర్వాత మీరు రాసిన విషయలపై చర్చిద్దాం. ఎవరు బాగా రాశారో నిర్ణయిద్దాం.సరేనా ‘ అడిగింది మిత్ర
‘ఒకే అత్తా ‘ అరిచారంతా .
‘ఇప్పుడే వస్తానత్తా’  అంటూ విశ్వ బయటికి పరుగు తీసాడు. అతని మొహంలో కొత్త వెలుగులు

వి . శాంతి ప్రబోధ

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

6 thoughts on “ఎడమచెయ్యి 

 • August 15, 2015 at 5:57 pm
  Permalink

  katha bagundandi…..

 • August 22, 2015 at 6:03 am
  Permalink

  Thank you Hanmantharao Garu

 • August 23, 2015 at 10:08 am
  Permalink

  ఎడమచెయ్యికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పగలరా? ఆలోచించండి. మీరెవరూ ఒక నెలలోగా చెప్పలేకపోతే నేను చెబుతాను.

 • October 15, 2015 at 7:54 pm
  Permalink

  శాంతి ప్రబోధ గారూ,
  మంచి విషయం మంచి కథా రూపంలో తెలియజేశారు.

  సత్యసాయి కొలచిన

 • October 23, 2015 at 5:01 am
  Permalink

  nice story

 • November 16, 2015 at 10:11 am
  Permalink

  thank you satyasai kolichina garu, Ramya garu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *