శభాష్ !

అల్లరి అంటే శ్రీజ , శ్రీజ అంటే అల్లరి!!! మా అక్కయ్య కూతురు శ్రీజ ఎనిమిది సంవత్సరాల వయసు , నాలుగోతరగతి చదువుతోంది. మేమందరం దానిని అప్పుడప్పుడూ ముద్దుగా “నసశ్రీ” అని కూడా పిలుస్తుంటాము . దేనికోసమైనా మంకు పట్టు పట్టిందంటే బ్రహ్మ రుద్రాదులు వచ్చినా ఆ పట్టు వీడదు . ఇదేమైనా గొప్ప లక్షణమా చెప్పుకోవటానికి అంటే కాదు మరి??? కానీ అంత అల్లరిచేసే శ్రీజ లోకూడా కొన్ని మంచి గుణాలు. ఉదాహరణకి —-చెప్పిన పని చేస్తుంది, స్కూలునించి రాగానే బుద్ధిగా హోంవర్క్ చేసేస్తుంది, ఆటలై ఇంటికి వచ్చాకా కూడా ఇంకా సమయం ఉంటే క్రియేటివ్ వర్క్ అంటే క్విల్లింగ్ అని ఇప్పుడు కొత్తగా అందరూ నేర్చుకుంటున్నారు అని తాను నేర్చుకుని చెవి లోలాకులు లాంటివి చేస్తుంటుంది , మట్టి (clay) తో రకరకాల బొమ్మలు చెయ్యటం …. వగైరా వగైరా చేస్తుంటుంది.

ఒకసారి అత్యవసరమైన పని పడి అక్క వాళ్ళింటికి వెళ్ళాను. శ్రీజ తో కాలక్షేపం చెయ్యటం అంటే నాకెంతో ఇష్టం. చాలా కాలం తరువాత మా ఇంట్లో చిన్న పిల్ల కావటంతో మా కందిరికి అదంటే ఎంతో ముద్దు.

ఒకరోజు ఏదో వ్రాసుకోవలసి వచ్చి నాలుగు తెల్ల కాగితాలు ఉంటే ఇవ్వమని అడిగాను శ్రీజ ని. వాళ్ళ నాన్నగారి గదిలోంచి తెచ్చి ఇచ్చింది. నేను వ్రాసుకోవటం అయిపోయిన తరువాత ఆ కాగితాలని హాలులో టేబుల్ పైన పెట్టేశాను. మర్నాడు ఆదివారం కావటం తో అందరమూ కొంచెం ఆలస్యంగా లేచాము. కానీ శ్రీజ మాత్రం తెల్లారకుండా లేచి కూర్చుంది!!. పిల్లలందరూ అంతే స్కూలు ఉన్నరోజున తొందరగా లేవటానికి పేచీపెడతారు కానీ సెలవు రోజున మాత్రం ఏదో పెద్ద పని ఉన్నట్లుగా తెల్లారకుండా లేచి కూర్చుంటారు, అదేం విచిత్రమో???? చిన్నపుడు నేను అంతేనట అమ్మ చెప్తుంటుంది !

నేను అక్కతో కబుర్లు చెప్తూ టీ త్రాగుతుండగా శ్రీజ నా దగ్గరికి వచ్చి “ పిన్నీ నీ కాగితాలు హాలులో టేబుల్ దగ్గర క్రింద నేలపైన పడిపోయి ఉన్నాయి , ఇవిగో “ అంటూ నా చేతికి ఇవ్వబోయింది.

“ అవి ఇంక నాకు అవసరం లేదమ్మా , చెత్త కాగితాలలో పడేయి “ అన్నాను .
“నాకు కావాలి , నేను తీసుకోనా?” అని అడిగింది.
“ అవి వాడేసిన కాగితాలు కదా నీకెందుకూ పనికిరావు , అదిగో అక్కడ అమ్మేయల్సిన పేపర్లలో పెట్టేయ్ “ అన్నాను ఒక మూలగా పెట్టి ఉన్న పేపర్ల బొత్తి వైపు చూపిస్తూ .
“ఊహూ ! ఇవి నాకు కావాలి “ అంది నొక్కి వక్కాణిస్తూ .

”సరే! అయితే తీసుకో” అన్నాను వాటితో నాకెలాగు ఇంక అవసరంలేదు కదా అని.
“థ్యాంక్స్ పిన్నీ” అంటూ ఆనందంగా ఆ కాగితాలు తీసుకుని వెళ్ళి పోయింది. అందులో శ్రీజ కి అంత ఆనందం కలిగించిన విషయమేమితో నాకు అంతు పట్టలేదు.
“ఏదో చిన్న పిల్ల సరదా అయి ఉంటుంది “ అని అనుకుని ఇంక ఆ విషయం అంతటితో మర్చిపోయాను.
ఆ సాయంత్రం అక్క, అత్తయ్యగారు, మామయ్యగారు , నేను కూర్చుని కాఫీ త్రాగుతున్నాము . అక్క ఏదో చెప్తోంది. బావగారు ఎవరో స్నేహితుడు వస్తే ఆయనతో బయటకు వెళ్లారు. శ్రీజ కూడా మా దగ్గరే కూర్చుని దీక్ష గా ఏదో చేసుకుంటోంది. అక్క మాటలు వింటూనే శ్రీజ చేసే పనిని ఆసక్తిగా గమనించసాగాను.
శ్రీజ తన స్కూలు బ్యాగు లోంచి సుమారు పది కాగితాలు బయటకి తీసింది. వాటిలో ఉదయం నన్ను అడిగి తీసుకున్న కాగితాలు కూడా ఉండటం నా కంట బడింది.
అవి చూశాక “ శ్రీజ ఏమి చెయ్యబోతోందో “ అని నా ఆసక్తి మరింత పెరిగింది.

తరువాత శ్రీజ ఆ పది కాగితాలని మధ్యకి మడిచి సగానికి చింపింది . ఇప్పుడు అవి ఇరవై కాగితాలయ్యాయి. ఆ ఇరవైని మళ్ళీ సగానికి మడిచి , ఇందాకటిలాగే మళ్ళీ చింపింది . అప్పటికి అవి మొత్తం నలభై (1/4 th) పావు సైజు కాగితాలయ్యాయి . ఇప్పుడు వాటన్నిటిని సమానంగా సర్ది పెట్టి తలెత్తి చూసింది. తండ్రి అక్కడ లేకపోవటం గమనించి తల్లి దగ్గరికి వెళ్ళి
“ అమ్మా ! ఈ కాగితాలన్నీ కలిపి నాకు పుస్తకంలా కుట్టిపెట్టవా?” అని అడిగింది వాళ్ళమ్మని.
తల్లి దగ్గరనింఛి “ఇప్పుడు కాదమ్మా , తరవాత కుట్టి పెడతాలే” అని సమాధానం రావటంతో , శ్రీజ నా దగ్గరికి వచ్చి “పిన్నీ ! వీటన్నిటిని ఒక నోటు పుస్తకంలా కుట్టి పెట్టావా?” అని అడిగింది.

“ ఎందుకమ్మా ? ఈ పుస్తకాన్ని ఏంచేసుకుంటావు? అని అడిగాను.
“ దీన్ని నేను స్లామ్ బుక్ (slam book) లా వాడుకుంటాను” అంది.
శ్రీజ స్లామ్ బుక్ అనే పదం ఎక్కడ విన్నదో , అసలు ఆ పదానికి అర్థం దానికి సరిగ్గా తెలుసా అనుకుంటూ “ స్లామ్ బుక్ అంటే ఏమిటమ్మా?” అని అడిగాను దాని సమాధానం విందామని.

“ స్లామ్ బుక్ అంటే తెలియదా నీకు? ఇందులో ప్రెండ్స్ ఫోన్ నంబర్లు, వాళ్ళ పుట్టిన రోజులూ , ఇంకా క్లాసులో టీచరుగారు ఏదైనా నోట్ చేసుకోమని చెప్తే అది ….ఇలా అన్నీ ఇందులో రాసుకోవచ్చన్నమాట !” అంది కించిత్ గర్వంగా, “చూశావా నాకెన్ని విషయాలు తెలుసో?” అన్న భావం దాని మాటల్లో ధ్వనించింది. శ్రీజ భాషలో “స్లామ్ బుక్” అంటే “పాకెట్ నోట్ బుక్” లాంటిది అన్నమాట అనుకున్నాను.

“ఎందుకమ్మా ఇలా వాడేసిన కాగితాలతో ఇంత కష్ట పడటం , నాన్నగారిని అడిగితే ఇలాంటి చిన్న పుస్తకం ఒకటి కొని పెడతారుగా నీకు?” అన్నాను ఆప్యాయంగా శ్రీజ తో.
“ ఈ కాగితాలన్నీ ఒక వైపే వ్రాసి ఉన్నాయి పిన్నీ , చూడు రెండోవైపు తెల్లగానే ఉన్నాయిగా. మరి అది వేస్ట్ (వృథా) అవుతుందిగా. మా టీచరుగారు ఒక రోజు సైన్సు పాఠం చెప్తూ ఒక కాగితం చెయ్యాలంటే ఎన్నో చెట్లు కొట్టేయాలని
చెట్లని కొట్టేస్తే మనకి ఎంతో నష్టమని , అందుకని కాగితాలని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పారు
తెలుసా? అందుకని అప్పటినించి నేను కొంచం వ్రాసి ఉన్న కాగితాలన్నీ పారేయకుండా దాచుకుంటున్నాను. ఇవాళ నువ్వు ఇచ్చిన వాటితో కలిపి పది కాగితాలయ్యాయి , అన్నీ కలిపి ఇలా చేశాను “ అంది.

నా నెత్తి పైన ఎవరో “ఠప్” మని మొట్టినట్లయి అప్రయత్నంగా తల తడుముకున్నాను.
“వృక్షో రక్షతి రక్షితః “ అంటే “మనం చెట్లని కాపాడితే అవి మనల్ని కాపాడతాయి” ఈ సత్యాన్ని చిన్నదైనా శ్రీజ నమ్మింది , అంతే కాకుండా పాటిస్తోంది కూడా దాని పరిధి లో !!!!

“చిన్నపిల్ల అయినా కూడా ఒక మంచి విషయం దిశగా నన్ను కూడా ఆలోచింప చేసింది “ అనుకున్నాను మనసులోనే.
“ ఇలా చేయాలని ఎక్కడ చూసి నేర్చుకున్నావమ్మా?” అని అడిగాను మళ్ళీ ఆసక్తిగా.
“ ఒకరోజు టి.వి. లో ఒక ప్రోగ్రాం లో కొంచం వ్రాసేసిన కాగితాలని ఎలా ఉపయోగించుకోవచ్చో చూపించారు. అది చూసి నేర్చుకున్నాను” అంది.
“అంటే టి.వి. చూడటం వల్ల కొన్ని మంచి విషయాలు కూడా నేర్చుకుంటోందన్నమాట శ్రీజ” అనుకుని సంతోషించి “సరే “ అని శ్రీజ కి కావలసినట్లుగా పుస్తకం కుట్టి దాని చేతికి ఇచ్చాను.

“థ్యాంక్స్ పిన్నీ!” అంటూ పుస్తకాన్ని ఆనందంగా చూసుకుని , నన్ను గట్టిగా కౌగలించుకుని ముద్దుపెట్టింది.
నేను కూడా ప్రేమగా దానిని దగ్గరికి తీసుకుని ముద్దుపెట్టి “ శభాష్ “ అని శ్రీజ ని అభినందించాను.

*****దినవహి సత్యవతి (09790752180)

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

3 thoughts on “శభాష్ !

 • September 13, 2015 at 4:44 am
  Permalink

  కథ చాలా బాగుంది.పేపర్ ని పొదుపు చేసి కూడా అడవులను కాపాడుకోవచ్చు అన్న మాట.

 • October 2, 2015 at 3:59 am
  Permalink

  సత్యవతి గారూ,
  మంచి కథల ద్వారా చిన్నపిల్లలకి మంచి అలవాట్లు నేర్పిస్తున్నారు.

  ఇటువంటి మంచి కథలు మాకు అందిస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు.

  సత్యసాయి కొలచిన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *