కాగితం – కరెన్సీ నోటు

ఫోన్ మోగుతోంది చూడరా చిన్నా ..
గార్డెన్ లోని కలుపు మొక్కలు ఏరేస్తూ అమ్మ కేకవేసింది.
కథల పుస్తకం చదువుకుంటున్న ఏడేళ్ళ చిన్నా లేచి వెళ్లి ఫోన్ ఎత్తాడు. అవతల తండ్రి గొంతు.
ప్యాంటు జేబులో డబ్బులున్నాయి తీయడం మరచిపోయి అట్లాగే వాషింగ్ మిషన్ లో వేశాను . అమ్మకు చెప్పు అని చెప్పి పెట్టేశాడు .
‘అమ్మా… అమ్మా’ అంటూ అరుస్తూ పరుగెత్తుకొచ్చిన చిన్నావాషింగ్ మిషన్ చప్పుడు విన్నాడు .
అయ్యో.. అయ్యయ్యో అని అరిచాడు .

ఏమయిందో అర్ధం కాని చిన్నా తల్లి వసంత కంగారు పడుతూ చిన్నా దగ్గరికి పరుగు పరుగున వచ్చింది .
వాషింగ్ మిషన్ వైపు గుడ్లప్పగించి చేయి చూపుతూ నించున్నాడు చిన్నా
ఏమైందిరా చిన్నా .. అర్ధం కాని అమ్మ అడిగింది

నాన్న ఫోన్ చేశారు కదా అంటూ తండ్రి చెప్పిన విషయం చెప్పాడు.
‘అవునా ..’ అంటూ వాషింగ్ మిషన్ స్విచ్చి ఆఫ్ చేసింది వసంత
మూత తీసి చూస్తే వంద రూపాయల నోటు ఒకటి నలిగి నీళ్ళపై తేలి కనిపిస్తూ .. గబగబా ప్యాంటు తీసింది. మిగిలిన నోట్లన్నీ రబ్బరు బాండుతో కట్టేసి జేబులోనే ఉన్నాయి . వాటిని బయటికి తీసింది అమ్మ. అవి తడిసి కొద్దిగా నలిగినట్లుగా కన్పించాయి

అమ్మయ్య, అన్నీ బాగానే ఉన్నాయని వాటిని కట్టనుండి విడదీసి ఫాన్ వేసి ఒక్కోటి ఆర బెడ్తోంది అమ్మ.
‘అమ్మా వీటిని ఇస్త్రీ చేస్తే సాపుగా అవుతాయి కదా’ వాటినే పరీక్షగా చూస్తూ అన్నాడు చిన్నా
‘అవునురా .. తడి ఆరిన తర్వాత అదే పనిచేద్దాం. ఈ రోజు మనకి బడి లేదని మీ నాన్న భలే పని పెట్టారులే ‘ చిన్నగా నవ్వుతూ అంది అమ్మ. అవునన్నట్లు తలూపాడు చిన్నా.

అమ్మ ఆరబెట్టడం చూస్తున్న చిన్నా చిన్ని బుర్రలో సందేహం.
‘అమ్మా నేను ఒక రోజు జేబులో ఒక పేపర్ పెట్టి మరచిపోయాను. నువ్వు చూసుకోకుండా అట్లాగే మిషన్ లో వేసావు, గుర్తుందా ..?’
‘ఊ .. ఇప్పుడావిషయం ఎందుకు గుర్తొచ్చింది ‘ ?

‘అప్పడు ఆ పేపర్ నానిపోయి చిరిగి ముక్కలు ముక్కలుగా అయిపొయింది . మిగతా బట్టలకి ఆ చిన్న చిన్న ముక్కలు అతుక్కుపోయాయి. మరి రూపాయలు ఎందుకు అట్లా కాలేదు ?’ తన సందేహం వెలిబుచ్చాడు చిన్నా

‘అవును నిజమే .. ఎందుకు అట్లా కాలేదు ‘? ఆలోచిస్తూ అమ్మ అంది .
లోపలికి అడుగు పెడ్తూ చిన్నా ప్రశ్న విన్న సమంత నేను చెప్పనా’ అంది నవ్వుతూ
‘ఓ .. చెప్పు పిన్నీ.. చెప్పు ‘ అంటూ ఆమె చేయి పట్టుకుని సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు చిన్నా .
కారణం తెలుసుకుందామని చేస్తున్న పని ఆపి చెల్లెలు చెప్పే విషయం వినడానికి సిద్దమయింది వసంత

పిన్ని ఏం చెబుతుందా అని చెవులు రిక్కించి ఆమె మొహంలోకి కళ్ళార్పకుండా చూస్తున్నాడు చిన్నా .
‘నిజమే నోటుపుస్తకాలకు , న్యూస్ పేపర్ లకు , ఇతర పుస్తకాలకు అంటే మనం సాధారణంగా వాడే పేపర్ కి కరెన్సీ తయారీకి వాడే పేపర్ కీ చాలా తేడా ఉంది. మామూలు పేపర్ చెట్లనుంచి వచ్చే పదార్ధంతో చేస్తారు. అదే నోట్లకు వాడే పేపర్ని పత్తి , ఊలు, కొన్నిరకాల గుడ్డ పీలికల నార వేసి చేస్తారు. అందుకే అవి నీళ్ళలో త్వరగా నానిపోవు. చిరిగిపోవు. చాలా నాణ్యంగా ఉంటాయి ‘ చిన్నా బుర్రకి అర్ధమయ్యేలా చెప్పింది పిన్ని

‘ఓ అదా సంగతి.. నాకూ తెలియదు’ అంటూ లేచి వెళ్లి చెల్లికి మంచినీళ్ళ గ్లాసు అందించింది అమ్మ
తనకు తెలిసిన విషయం చెప్దామని పక్కింటి చిన్నారి దగ్గరకి తుర్రుమన్నాడు చిన్నా

*
shanti prabodha Valluripalli

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

3 thoughts on “కాగితం – కరెన్సీ నోటు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *