మన “ఆటలు”

శరీరానికి వ్యాయామంతోపాటు మెదడుకి చురుకుతనాన్ని కూడా పెంచే ఎన్నో “ఆటలు” ఉన్నాయి మనకి. బాల బాలికలందరూ కలిసి ఆడుకోవచ్చు ఈ ఆటలు. ఇవాళ అందులో కొన్నింటిని గురించి తెలుసుకుందామా!

 1. ముక్కు గిల్లి పో! “ ( జ్ఞాపక శక్తి పెరగటానికి తోడ్పడే ఆట)

ఈ ఆట ఆడటానికి ఎనిమిది నించి పదిమంది పిల్లలు ఉంటే బాగుంటుంది. ఆట ప్రారంభించటానికి ముందే ఈ ఆటకి కొంత నిర్ణీత సమయాన్ని(Time Frame ) కేటాయించుకోవాలి (సుమారు గంట లేదా రెండు గంటలు) . ఆటలో పాల్గొనే పిల్లలందరూ రెండు జట్లుగా(groups) ఏర్పడాలి. జట్లకి A , B అని పేర్లు పెట్టుకుని(జట్టు పేరు ఏదైనా ఉండవచ్చు) రెండు జట్లకి చెరొక నాయకుడిని (leader) ఎన్నుకోవాలి.

A – జట్టు నాయకుడు తన జట్టులోని వారందిరికి మారు పేర్లు(Nick Names) పెట్టుకుని ఆ పేర్లన్నింటిని గుర్తు పెట్టుకోవాలి (ఆటగాళ్ల అసలు పేర్లు వాడకూడదు) . నాయకుడితోపాటు ఆటగాళ్లు కూడా తమ తమ “మారు పేర్లు” గుర్తుపెట్టుకోవాలి .

ఉదాహరణకి : పువ్వుల పేర్లుగానీ (జాజి, మల్లి , బంతి వగైరా వగైరా … ) ఫలాల పేర్లుగానీ( ఆపిల్, జామ, నారింజ వగైరా వగైరా ….) పెట్టుకోవచ్చు.

అదేవిధంగా B జట్టు నాయకుడు కూడా తన జట్టు లోని ఆటగాళ్ళకి “మారు పేర్లు” పెట్టుకోవాలి .

అనంతరం B జట్టు నాయకుడు, A జట్టు లోకి వచ్చి అందులో ఎవరైనా ఒక ఆటగాడి కళ్ళు తన చేతులతో మూసి, తన జట్టులోని వాడి “మారు పేరు” పలికి “వచ్చి ముక్కుగిల్లి పో” అని పిలవాలి . అప్పుడు B జట్టులోని ఆ “మారు పేరు” కలవాడు వచ్చి ఆ కళ్లుమూసి ఉన్న ఆటగాడి ముక్కు (నెమ్మదిగా) గిల్లి వెళ్లి తన చోటులో కూర్చోవాలి. తరువాత B జట్టు నాయకుడు ఆ ఆటగాడి కళ్లమీద నించి చేతులు తీసివేయాలి . అప్పుడు ఆ A జట్టు ఆటగాడు కళ్ళు తెరిచి B జట్టు లోంచి “ తన ముక్కు ఎవరు గిల్లినదీ” ఊహించి (Guess) కనుక్కోగలిగితే ఆ B జట్టు ఆటగాడు A జట్టులోకి వచ్చేస్తాడు , కనుక్కోలేకపోతే ఈ A జట్టు ఆటగాడు B జట్టు లోకి వెళ్ళిపోతాడు.

ఇలా “నిర్ణీత సమయం “ ఒక గంట లేదా రెండు గంటల వరకు ఆడిన తరువాత A , B జట్లలో ఎందులో ఆటగాళ్లు ఎక్కువగా ఉంటే ఆ జట్టు “గెలిచినట్లు” గా నిర్ణయించబడుతుంది.

 1. నాలుగు స్తంభాల ఆట (వ్యాయామం చేకూర్చే ఆట):

నాలుగు స్తంభాలాట ఎంతసేపైనా ఆడుకోవచ్చు. ఈ ఆటకి 5 గురు ఆటగాళ్లు కావాలి. ఒక చతురస్రాకారమైన స్థలంలో (Square Area) నాలుగు స్తంభాలు(Four Pillar) ఉన్నచోట ఈ ఆట ఆడుకోవచ్చు.

ఉదాహరణకి ఇంటి ప్రాంగణంలో చతురస్రాకారంలో నాలుగు స్తంభాలు ఉన్నట్లైతే అక్కడ ఆడుకోవచ్చు ( Apartment Complex లో Cellar Area లో కూడా ఆడుకోవచ్చు).

5 గురు ఆటగాళ్లలో నలుగురు నాలుగు స్తంభాలు పట్టుకుని నిలబడి ఉంటే ఒక ఆటగాడు మధ్యలో నిలబడి ఉండాలి. ఆట ప్రారంభించే ముందుగా ఎవరు మధ్యలో ఉండాలి అనే దానిని చీటీల ద్వారా(5 గురు ఆటగాళ్ళ పేర్లు చీటీల పై వ్రాసి అందులోంచి ఒక చీటి ఎన్నుకుని అందులో ఎవరిపేరు ఉంటే ఆ ఆటగాడు మధ్యలో నిలబడేలాగా ) నిర్ణయించుకోవచ్చు.

అనంతరం స్తంభాలు పట్టుకుని ఉన్న ఆటగాళ్లు ఒక స్తంభం నించి ఇంకో స్తంభానికి పరుగు పెడుతున్నప్పుడు మధ్యలో ఉన్న ఆటగాడు కనుక వాళ్ళలో ఎవరిని ముట్టుకుంటే ఆ ఆటగాడు “అవుట్” అయినట్లు. “అవుట్” అయిన ఆటగాడు ఇప్పుడు “మధ్యలో” నిలబడతాడు.

ఆట తిరిగి మళ్ళీ పైన సూచించిన విధంగానే కొనసాగుతుంది. సమయం ఉంటే ఈ ఆట ఎంతసేపైనా సరదాగా ఆడుకొనవచ్చు.

****ప్రియమైన పిల్లలూ! తెలుసుకున్నారుకదా రెండు ఆటల గురించి! స్కూలు నించి వచ్చాక గానీ , సెలవలలో గాని మీ స్నేహితులతో కలిసి ఈ ఆటలు ఆడి చూడండి. మంచి కాలక్షేపం . ఇంకొన్ని ఆటల గురించి త్వరలో మళ్ళీ తెలుసుకుందాము. ….. దినవహి సత్యవతి (dsatya_p13@yahoo.com)

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

One thought on “మన “ఆటలు”

 • October 2, 2015 at 3:55 am
  Permalink

  సత్యవతి గారూ,
  మీరు మీ కథల ద్వారా, వ్యాసాల ద్వారా నన్ను, నాలాంటి వాళ్ళని చిన్నతనానికి తీసుకెళ్ళిపోతున్నారు.
  ఇవన్నీ చదువుతుంటే, ఈ రోజుల్లో పిల్లలు ఏం పోగొట్టుకుంటున్నారో తెలుస్తోంది.
  మీకు పాఠకులందరి తరఫున ధన్యవాదాలు.

  సత్యసాయి కొలచిన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *