రాము – అన్నం

ఆ రామూకి రోజూ పొద్దున్న లేవగానే కాకమ్మ కావు కావు అని అరుస్తుంటే చూస్తూ తనూ కావు కావు అంటూ అనుకరించడం అలవాటు. దాన్ని చూస్తూ అమ్మ అన్నం తినిపిస్తుంటే అన్నం తినడం ఒక్కోసారి నోట్లో పెట్టుకున్న ముద్ద వూసేసేవాడు. వాడు ఊసిన మెతుకుల్ని అమ్మ గిరాటెసేది.  ఎదురుగా ఉన్న చెట్టు మీది కాకి చటుక్కున వచ్చి ముక్కుతో కరుచుకుని పోయేది. అది చూసి రాము  మల్లీమళ్లీ  ఊసేసేవాడు. అది వాడికి ఆటలా అయిపొయింది. రామూ అన్నం తింటూ ఉంటే అక్కడికి పిచ్చుకలు , కాకులు వచ్చి చేరేవి. కాకులయితే కావు కావు అంటూ తన వాళ్ళని పిలిచేవి. ఒక్కోసారి చెట్టు పై నుండి కోతి వచ్చేసేది. అప్పుడు కాకులు మరీ ఎక్కువగా అరిచేవి.  ఆ అరుపులో తేడా అమ్మ గమనించేది. తన చేతిలోని వెండి గిన్నె జాగ్రత్తగా పట్టుకుని రాముని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయేది . రాము అరిచేసేవాడు రానని.
కాదురా నాన్నా .. అటు చూడు కోతి . అది అమ్మ చేతిలో గిన్నె పట్టుకెళ్ళి పోతుంది అని చెప్పేది . వాడికేదో అర్ధమయినట్లుగా తలూపేవాడు. అన్నం త్ఫు .. అంటూ నోటి నుండి దూరంగా విసురుతుంటే  అమ్మ విసుక్కునేది. రామూని కోప్పడేది. ఒక్కోసారి వాడు తినట్లేదని బాధతో ఏడ్చేసేది. వాడికి అన్నం ఎట్లా పెట్టాలో తెలియక. కొడుకు ఆకలితో ఉంటాడేమో నని ఆమె బాధ. కేర్ సెంటర్ లో వదిలి వెళ్తుంది కదా .. వాళ్ళు పెట్టింది ఏమి తింటాడో తెలియదు. తను పెట్టింది వాడు సరిగ్గా తింటే ఆమెకు తృప్తి.  కానీ వాడు తినకుండా విసిగిస్తాడు.
ఒకరోజు వాడు తినకుండా విసిగిస్తుంటే అమ్మకి ఏడుపొచ్చింది . ‘అమ్మా ఎందుకేడుత్తున్నావ్ ..’ చిట్టి చేతులతో ముద్దు ముద్దుగా  అమ్మ కళ్ళు తుడుస్తూ అడిగాడు మూడేళ్ళ రాము
‘నువ్వు అన్నం తినట్లేదుగా .. అందుకే ఏడుపొచ్చేసింది’ అంది వాడి ప్రేమకు మనసులో ఆనందపడుతూ
‘ అమ్మా నువ్వు నాకు రోజూ అన్నం పెడుతున్నావు కదా .. కాకికి, పిచ్చుకలకి ఎవరు పెడతారు ..? అవి తినక పొతే వాటికి ఆకలేత్తుందిగా .. వాటికి ఆకలేత్తే నాకు ఎడుపోత్తుంది. అందుకే వాటికేత్తున్నా .  నువ్వు నా పొట్ట నిండేదాక పెడ్తావుగా …’. ముద్దు ముద్దుగా మనసులో మాట చెప్తూ వాళ్ళమ్మ మొహంలోకి చూశాడు .

‘మనకి అన్నం ఎట్లా వస్తుంది ?’

‘నువ్వూ , నాన్న ఆపీసుకు పోయి పనిచేత్తే పైసలు వత్తాయిగా . వాటితో  మనం అన్నీ తెచ్చుకుంతాంగా .. ‘ అన్నాడు ప్రతి నెలా తల్లిదండ్రులతో వెళ్లి సరుకులు , కావలసిన వస్తువులు తెచ్చుకోవడం గుర్తొచ్చిన రాము

‘మనుషులు పనిచేసిన డబ్బులతో ఆహారం సంపాదించుకుంటారు. కాకులు, పిచ్చుకలు, కోతులు వంటివి వాటి తిండి కోసం అటూ ఇటూ తిరిగి ఆహారం సంపాదించుకుంటాయి. ఎవరికి కావలసిన ఆహారం వాళ్ళే సంపాదించుకోవాలి.’

‘అయితే నేనూ సంపాదించుకోవాలిగా .. ‘

‘అవును , ఇప్పుడే కాదు . పెద్దయ్యాక ‘

‘పెద్దగా అవ్వాలంటే ..’

‘రోజూ అమ్మ పెట్టినవి చక్కగా తినేయాలి. అప్పుడు నీకు చాలా బలం వస్తుంది. పెద్దగా అవుతావు.. ‘ అమ్మ చెప్తున్న మాటల మధ్యలోనే అందుకుని .

‘ఆ నేను పెద్దగా అవ్వాలి ‘  ఆ అని నోరు తెరిచి ముద్ద పెట్టిచ్చుకున్నాడు.
ఏయ్ కాకులూ, పిచ్చుకలూ ఇక నేను మీకు అన్నం పెట్టను. అమ్మ చెప్పింది విన్నారుగా మీరే మీ అన్నం సంపాదించుకోవాలి. తెల్సిందా .. ? మీకు జరమొస్తే పెడ్తాలే’ అంటూ అమ్మ దగ్గరి అన్నం గిన్నె తీసుకుని తనే తినేసాడు. అర్ధం చేసుకున్న కొడుకు తెలివి తేటలకి మురిసిపోయింది రాము తల్లి

వి. శాంతి ప్రబోధ

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *