దాచు…..దాచు….. పనికివస్తుంది!!!

“అమ్మా! నాకు స్కూల్లో పెన్సిల్ దొరికింది “ సంబరపడుతూ చెప్పాడు ఒకటవ  తరగతి చదువుతున్న సూరి.

“అలాగా నాయనా, దాచు …. పనికి వస్తుంది” అంటూ కొడుకుని  దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది మల్లి. ఉదయం  బడికి వెళ్ళేటప్పుడు దిగులుగా ఉన్న  తల్లి ముఖంలో ఇప్పుడు నవ్వు చూశాడు సూరి. అమ్మని సంతోషపెట్టే మార్గం ఏదో వాడికి తెలిసినట్లనిపించింది.

సూరిని బళ్ళో వేసిన కొన్ని రోజులకే వాడి తండ్రి త్రాగుడుకి బలి అయ్యాడు. పాతికేళ్ళ చిన్నవయసులోనే భర్తను పోగొట్టుకున్న మల్లి  ఆ ఇంటా – ఈ ఇంటా పనిచేసి కొడుకుని చదివించుకుంటోంది.  సూరి బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం చేస్తే ఆమెకు ఆసరా అవుతాడని  మల్లి  ఆశ.  

“నేను దిగులుగా ఉంటే పసివాడు ఇంకా బెంబేలెత్తిపోతాడు “ అనుకున్న మల్లి దుఃఖం దిగమింగుకుని పైకి సంతోషంగా కనిపించటానికి  ప్రయత్నంచేస్తుంటుంది . అందుకే కొడుకు ఏ  చిన్న విషయం చెప్పినా ఏదో గొప్ప విషయం విన్నట్లుగా ఆసక్తి కనబరుస్తుంది. ………

ఒకనాడు సూరి ఏడుస్తూ ఇంటికి వచ్చి “ అమ్మా ! నాన్న ఎక్కడ?” అడిగాడు తల్లిని.

ఏదో ఒకనాడు సూరి ఈ ప్రశ్న అడుగుతాడని తెలిసిన మల్లి  “ నాన్న  దేవుడి  దగ్గరకి వెళ్ళాడు బాబు” అంది.

“ఎప్పుడు వస్తాడు?”

“అక్కడ దేవుడు ఇచ్చిన పనంతా చెయ్యడం అయ్యాక వస్తాడు  ”

“నాకు నాన్న కావాలి ”

“ నాన్న తప్పక వస్తాడు “

“ఊహూ! నేను  ఇప్పుడే నాన్నని చూడాలి “ అంటూ ఇంకా పెద్దగా ఏడవ సాగాడు.  ఏం చెప్పాలో వాడిని ఎలా సముదాయించాలో తెలియని మల్లి  కూడా పసివాడిని ఒడిలోకి తీసుకుని పెనిమిటి  గుర్తుకు వచ్చి దుఃఖం పెల్లుబుకి రాగా ఎక్కుళ్ళు  పెట్టసాగింది. అమ్మ  కూడా ఏడవటంచూసిన సూరి ఏమనుకున్నాడో ఏమో వెంటనే ఏడుపు ఆపేశాడు. అమ్మ  ఏడుపు ఆ పసివాడిని కలవర పెట్టింది. “అమ్మని ఎలాగైనా మళ్ళీ నవ్వించాలి” అని ఆలోచిస్తూ  అలాగే ఆమె  ఒడిలో నిద్రపోయాడు……….

 

“ఆమ్మా ! ఇవాళ నాకు దారిలో ఒక పెన్ను దొరికింది” వస్తూనే తల్లితో చెప్పాడు.

“మంచిది సూరి, దాచు  పనికివస్తుంది”  ఉత్సాహంగా  చెప్పిన తల్లి సమాధానానికి తృప్తిపడి పెన్ను తీసుకుని వెళ్లిపోయాడు.

ఇలా “అమ్మ ముఖంలో నవ్వు చూడాలని “ సూరి ఏదో దొరికిందని తీసుకుని రావడం వాడిని చిన్నబుచ్చడానికి మనసొప్పక  మల్లి  “దాచు…దాచు… పనికివస్తుందని” చెప్పడం  పరిపాటి అయ్యింది. “ఇటు  పసివాడు అటు ఒంటరి జీవితం ఎలా గడుస్తుందో?”  అనే  బాధ లో ఉన్న మల్లికి  ఎన్నడూ వాడిని అది ఎలా దొరికిందని అడగాలనే ఆలోచనే రాలేదు. చిన్నతనం కావడం వల్ల అది చెప్పాలనే  వాడికి తెలియలేదు , ఆ సమయంలో అమ్మ  ముఖంలో సంతోషం ఒక్కటే చూశాడు సూరి!..!..!

సూరి మూడవ  తరగతిలోకి వచ్చాడు. ఒకనాడు స్కూలుకి వచ్చి కలుసుకోవలసినదని హెడ్మాష్టారు వద్దనించి కబురు వచ్చింది మల్లికి.

“ఎందుకు కబురంపారో ? సూరిగాడేమైనా అల్లరి చేశాడా?” అనుకుంటూ భయపడుతూ వెళ్లింది మల్లి . అప్పటికే సూరి అక్కడ తలవంచుకుని నిలబడి ఉన్నాడు.

“నీ  కొడుకు క్లాసులో పక్కవాడి  బ్యాగు లోంచి పది రూపాయలు  తీసుకున్నాడు !”  సూరిని చూపిస్తూ చెప్పారు  హెడ్మాష్టర్ గారు. ఆయన మాటలకి నిర్ఘాంత పోయింది మల్లి .

“నా బిడ్డ అసుమంటోడు కాదండీ. అట్టాంటి పని చేసే అవసరం ఆడికి లేదండీ “ అంది అకారణంగా తన బిడ్డకి దొంగతనం అంటగట్టడానికి చూస్తున్నారని  బాధపడుతూ.

“సరే! నువ్వే అడుగు  వాడిని?”

“ఏరా  మాష్టారుగారు చెప్పింది నిజమేనా?” గదిమింది  కొడుకుని. సూరి మౌనమే సమాధానమయ్యింది.

పసివాడి పట్ల దొంగతనం అనే పెద్ద మాటని ఉపయోగించడం ఇష్టంలేక  “ఎందుకు తీశావురా పది రూపాయలు?” అంటూ హెడ్మాష్టారు కోపంగా అడిగేటప్పటికి  భయంతో ఏడవటం మొదలు పెట్టాడు సూరి.

“దొరికిందని చెప్పి అమ్మకి ఇద్దామని!” అన్నాడు వెక్కుతూ .

“ఇస్తే?”

“మరీ అమ్మేమో అలా నేనేం ఇచ్చినా దాచు..దాచు….పనికివస్తుంది అని నన్ను ముద్దు పెట్టుకుంటుంది అందుకని” అన్నాడు అమాయకంగా .  

“వాడు చెప్పింది విన్నావుగా , ఇప్పుడేమంటావు  మల్లీ ?”

సూరి మాటలు విన్న  మల్లి  “అయ్యో! దేవుడా, ఎంత పని జరిగింది, బిడ్డడు  ఏదో దొరికిందని తెచ్చి ఆనందంగా చూపిస్తా ఉంటే ఆడిని చిన్నబుచ్చడమెందుకని అలా చేసానే కానీ , ఆడు ఇట్టా  సేస్తాడనుకోలేదు “ అంటూ వాపోయింది.

“చూడు మల్లి  ! సూరి ఏం  తెచ్చి నీకు ఇచ్చినా దాచు..దాచు..పనికివస్తుందంటూ  నువ్వేమో వాడిని చిన్నబుచ్చకూడదని చూసావు .  వాడేమో నిన్ను సంతోషపెట్టాలని ఇదంతా చేశాడు.  ఇది వాడి మొదటి తప్పుగా భావించి  క్షమించి వదిలి పెడుతున్నాను. సూరి పసివాడు. నువ్వే బిడ్డని కనిపెట్టుకుంటూ ఉండాలి. చేసేది మంచి పనో కాదో తెలుసుకోకుండా  వాడు చేసే ప్రతి పనిని మెచ్చుకోకూడదు . లేకపోతే వాడు తప్పుడు  మార్గంలోపడి దొంగగా మారే ప్రమాదం ఉంది “ అంటూ హెచ్చరించారు హెడ్మాష్టారు.   అనంతరం సూరిని క్లాసుకి పంపేశారు.

“నా తప్పు తెలిసొచ్చినాది . మీరు చెప్పినట్టే  ఇకపై  సూరిని కనిపెట్టుకుని ఉంటానండి “ అంటూ హెడ్మాష్టారుకి నమస్కారం పెట్టి ఇంటికి బయలుదేరింది మల్లి  .

***** ప్రియమైన బాలలు  చిన్నతనంనించి   మంచి – చెడు  మధ్య తేడా తెలుసుకుని మసులుకోండి…..

—-దినవహి సత్యవతి(dsatya_p13@yahoo.com)  

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

One thought on “దాచు…..దాచు….. పనికివస్తుంది!!!

  • April 11, 2016 at 12:38 am
    Permalink

    Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *