అడుక్కునే వాడు

‘నాన్నా.. నాన్నా ..అతన్ని చూడు.  అతను అలా ఉన్నాడేంటి ..? ‘ బోర్డింగ్ స్కూల్ నుండి వేసవి సెలవులకి వచ్చిన ఏడేళ్ళ ధీరజ్ ప్రశ్న.

‘ఆ ఎవరూ .. ఓ వాడా .. బిచ్చగాడ్లే .. ‘ కొడుకు ఎవర్ని చూడమంటున్నాడు అనుకొంటూ అటుకేసి ఆసక్తితో చూసిన తర్వాత నిర్లక్ష్యంగా తండ్రి జవాబు
‘బిచ్చగాడా ..? అంటే? ‘ మరో ప్రశ్న కొడుకు నుండి
‘ఊ .. ‘ తల గోక్కుంటూ ఒక్క నిముషం ఆగి,  ‘ బిచ్చగాడంటే  బెగ్గర్ ‘ అన్నాడు ధీరజ్ తండ్రి.
‘ ఓ .. బెగ్గరా ..’ ఏదో అర్ధమయినట్లుగా ధీరజ్
‘ అతనేం చేస్తాడు నాన్నా ..’ మరో ప్రశ్న సంధించాడు
‘అందరి దగ్గరింటికి వచ్చి అన్నం , కూర , డబ్బులు అన్నీ అడుక్కుంటాడు ‘
‘అన్నీ అంటే ..?’
‘ఒరేయ్ .. నీ  ప్రశ్నలకి జవాబు నేను చెప్పలేను.  కానీ, పోయి మీ అమ్మనడుగు పో .. ‘ కొద్దిగా విసుగ్గా అని పేపర్ లో తల దూర్చాడు.
ఇక లాభం లేదనుకున్నాడేమో లోపలికి తుర్రు మన్నాడు ధీరజ్.  గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ అంతే వేగంతో వెనక్కి తిరిగొచ్చాడు.
‘నాన్నా అమ్మ వంట పనిలో చాలా బిజీగా ఉందట. మిమ్మల్నే అడగమంది ‘ తండ్రి చెయ్యి పట్టి లాగుతూ అతని తల తన వైపు తిప్పుకుంటూ అన్నాడు.
‘కొద్దిగా ఆగు బేటా .. ‘ అన్న తండ్రి కేసి ఓ క్షణం దీర్ఘంగా చూస్తుండగా బిచ్చగాడి గొంతు ధీరజ్ చెవిన పడింది.  బిచ్చగాడు మరో ఇంటిముందు నిలబడి ‘ అమ్మా ఇంత ముద్దెయ్యమ్మా ..’ అరుస్తున్నాడు
బిచ్చగాళ్ళు అన్నం వండుకోరా ..? అతనికి వాళ్ళమ్మ అన్నం పెట్టదా ..అడుక్కుంటున్నారు.
అన్నం, కూర,  చారు, అప్పచ్చిలు ఏవేవో చాలా అమ్మ వండి పెడుతుంది. నాకు వద్దన్నా అవి తిను ఇవి తిను .. చాలా బలం వస్తుంది అంటూ నన్ను కబుర్లలో పెట్టి తినిపిస్తుంది అమ్మ .  మరి వాళ్ళెందుకు వండుకోరో .. ఎన్నెన్నో సందేహాలు ఆ చిన్ని బుర్రలో . ఆ అడుక్కునే వ్యక్తిని చూస్తే చాలా జాలి కలిగింది ధీరజ్ కి.
ఛి .. ఛ్చి .. తెల్లారిందో లేదా తయారవుతారు . వీళ్ళ కోసం వండి వార్చారని .. అతన్ని తిడుతోంది ఆ ఇంటావిడ.
మౌనంగా ముందుకు కదిలి పోతున్నాడు అతను.
‘అయ్యో పాపం నాన్నా .. అతనికి ఆకలేస్తోంది కావచ్చు .  అతనికి నా దగ్గరున్న బిస్కెట్ పాకెట్ ఇచ్చొస్తా ..’ ముందుకు కదలబోయాడు ధీరజ్

‘చీ.. నువ్వు వీడికేమైంది.  ఎప్పుడూ ఆ అలగా జనం గురించి అడుగుతాడు ‘ అటుగా వచ్చిన భార్యతో అని కొద్ది క్షణాలు ఆగి , ‘ఆ అడుక్కునేవాడి గురించి నీకెందుకురా .. పోయి వీడియో గేమ్స్ , కంప్యూటర్ గేమ్స్ ఆడుకో పో .. ‘ విసుగ్గా గడిమాడు ధీరజ్ తండ్రి

ఏంటో నాకేం అస్సలు అర్ధం కావట్లేదు.  నాన్నెళ్ళి ఓట్లు అడుక్కుంటాడు .. ఇంటింటికీ తిరిగి నాకే ఓటేయ్యమని అందరికీ దండాలు పెడతాడు అని మనసులో అనుకొని, వెళ్తోన్న తల్లి చెయ్యి పట్టుకుని ఆపి వెళ్తోన్న బిచ్చగాడిని చూపుతూ   ‘అన్నం అడుక్కుంటున్నాడని అతన్ని బిచ్చగాడు  అంటున్నాడు  నాన్న .  మరి నాన్న కూడా ఓట్ల బిచ్చగాడే కదమ్మా .. ‘ అమాయకంగా ప్రశ్నిస్తున్న ధీరజ్ మాటలకి
‘ష్ .. తప్పు అలా అనకూడదు. నాన్న నాయకుడు’ అంది వాళ్ళమ్మ
‘ఓట్లు అడిగితే నాయకుడు. అన్నం అడిగితే బిచ్చగాడా .. ‘ అర్ధం కాక అయోమయంలో పడ్డాడు ధీరజ్
అప్పుడే లోనికి వచ్చి పై పంచె తీసి పడక్కుర్చీలో వాలుతూ ‘నువ్వే కరెక్టు రా మనవడా ..’ అన్న తాత మాటలతో ధీరజ్ మొహం వెలిగిపోయింది

వి. శాంతి ప్రబోధ

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

5 thoughts on “అడుక్కునే వాడు

 • January 21, 2016 at 10:20 pm
  Permalink

  మీ కథ బాగుంది శాంతి ప్రబోధగారూ!

 • January 29, 2016 at 8:47 am
  Permalink

  thank you

 • March 12, 2016 at 12:13 pm
  Permalink

  thank you madam

 • March 22, 2016 at 11:29 am
  Permalink

  చిన్న కథలో మంచి సందేశం అందించారు శాంతి ప్రబోధ గారూ !

 • April 26, 2016 at 8:15 am
  Permalink

  Avunu miru cheppindhi correct madam okka matalo cheppali ante”nayakudu-bicchagadu,”bicchagadu -nayakudu”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *