ఎండదెబ్బ

‘అమ్మా నాన్నకేమైంది’  దిగాలుగా అడిగాడు ఐదేళ్ళ చింటూ

‘ఎండ దెబ్బ తగలిందిరా కన్నా ‘ అంది అమ్మ

‘ఎండ నాన్నని కొట్టిందా .. ?’ చింటూ కళ్ళలో ఆశ్చర్యం . ఆ వెంటనే ‘ఎండకి చేతుల్లేవు కదమ్మా .. ‘ అడిగాడు అమ్మని

నవ్వుకున్న తల్లి చింటూకి అర్ధమయ్యే విధంగా చెప్పబోయింది . అంతలో ‘అసలే ఈ ఏడాది ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి . 50 డిగ్రీలకు చేరుతుందంటున్నారు.  జాగ్రత్త బావా’ అంటూ వచ్చాడు చింటూ  మేనమామ

‘మామయ్యా .. నాన్నకి ఎండ దెబ్బ కొట్టింది .  ఎవరు ఎండలోకి పోయినా ఎండదెబ్బ తగులుతుందట. అమ్మ చెప్పింది. నిజమా మామయ్యా ‘ తల్లి మాటలు నమ్మలేనట్లు కళ్ళు తిప్పుతూ అడిగాడు చింటూ
‘అవున్రా .. నువ్వు పోయినా .. నేను పోయినా ఎవరుపోయినా మీ నాన్నలాగే  ఎండ దెబ్బ తప్పదు’ అన్నాడు మామయ్య చింటూని దగ్గరకు తీసుకుంటూ
‘ అయ్యో  ఎట్లా .. ఆ చెట్లన్నీ ఎండలోనే ఉన్నాయి కదా .. .’ కొన్ని క్షణాలు ఆగి ‘చెట్లపై ఉండే పిట్టలు , జంతువులు అన్నీ ఎక్కడుంటాయో … వాటికి మన లాగా ఇల్లు లేదుగా ..’ అన్నాడు జాలిగా
‘పిట్టలు వాటి గూట్లో ఉంటాయి . జంతువులు కూడా వాటికి తగిన నివాసం అవి ఏర్పాటు చేసుకుంటాయిలేరా ‘ అన్నాడు మామయ్య
ఆ జవాబు చింటూ కి సంతృప్తినివ్వలేదు.
ఎండని ఇచ్చేది సూర్యుడు కదా ..సూర్యుడినే అడుగుదాం అనుకున్నాడు. పెద్దల వైపు చూశాడు . తండ్రి మగతగా పడుకుని ఉన్నాడు. అమ్మ మామయ్య నెమ్మదిగా ఎండల గురించే ఏవేవో మాట్లాడుకుంటున్నారు. నెమ్మదిగా మామయ్య వడినుండి బయటపడ్డాడు. శబ్దం రాకుండా అడుగులోంచి అడుగు వేస్తూ బయటికి నడిచాడు. అమ్మ చూస్తే ఎండలోకి ఎక్కడకని కోప్పడుతుందని వాడి భయం.  ఇంట్లోంచి బయటికొచ్చి సూర్యా సూర్యా .. నువ్వు ఎందుకు అందరినీ ఎండతో కొడుతున్నావు.  మా నాన్న చూడు ఎట్లా అయిపోయాడో .. ఇంకాసేపు అట్లాగే ఉంటే చని పోతారట కదా .. నిజమేనా ..? నీళ్ళు బాగా తాగాలట కదా ఎండదెబ్బ తగలకుండా .. చల్లటి వాతావరణంలో ఉండాలట కదా .. మాకంటే తాగడానికి నీళ్లున్నాయి. కుండలో నీళ్ళో , ప్రిజ్ నీళ్ళో తాగుతాం. చల్లగా ఉండడానికి కూలర్ వేసుకుంటాం . ఏసీ వేసుకుంటాం . ఎండలో తిరగకుండా జాగ్రత్త పడతాం . మా కంటే కాళ్ళూ చేతులూ ఉన్నాయి. మేము నీడలోకి వెళ్తాం. మరి చెట్లకి కాళ్ళు చేతులు  లేవుగా .. పాపం చెట్లు .. ఎండలోనే ఏడుస్తూ ఉన్నాయి. ఎట్లా అయిపోయాయో చూడు. వాటికి నీళ్ళు కావాలంటే ఎవరు తెచ్చిస్తారు. మబ్బుల్ని అడుగుదామంటే అవి అసలు కనిపించడం లేదు. పాపం పక్షులు , జంతువులు వాటికి నీళ్ళు దొరుకుతున్నాయో లేదో ..వాటికి ఎండ దెబ్బ తగిలితే గ్లూకోజ్,  నిమ్మకాయ రసం ఎవరిస్తారు ..? తడిగుడ్డతో ఒళ్లంతా ఎవరు తుడుస్తారు ?  కణతలకి, ఛాతికి ఉల్లిపాయ రసం రాసినట్టు ఎవరు రాస్తారు ? మా నాన్నకంటే మా అమ్మ చేసింది .  వాటికి ఎట్లా సూర్యా .. అందుకే…   నీ ఎండని నువ్వే ఉంచేసుకో కూడదూ .. ‘ ప్రాధేయపూర్వకంగా అడిగాడు చింటూ .
అందుకు సూర్యుడు పగలబడి నవ్వాడు .
‘ఏయ్ ఎందుకు అట్లా నవ్వుతున్నావు’ ఉక్రోషంగా అడిగాడు చింటూ
‘ ఓరీ .. పసివాడా .. నేనెప్పుడూ ఒక లాగానే ఉన్నాను’ వచ్చే నవ్వుని ఆపుకుంటూ అంది సూరీడు .
‘మరయితే ఎండ దెబ్బ ఎందుకు తగిలింది మా నాన్నకి? ‘ కొంచెం ఆవేశంగా ప్రశ్నించాడు చింటూ
‘నా తప్పు ఏం లేదురా అబ్బాయ్.  ఇలా నా వేడి పెరగడానికి కారణం ఎవరూ .. మీరేరా .. అంటే నువ్వని కాదు , మీ మనుషులేనని  .. ‘
‘అవునా.. అదెట్లా ‘ ఆశ్చర్యం చింటూ గొంతులో .
‘ఒరే నువ్వు పసివాడివిరా . ఎందుకు ఇట్లా జరుగుతోందో నీకు తెలీదు . అయినా ఎండదెబ్బ మీ మనుషులకే కాదు , చెట్లకు పశుపక్ష్యాదులకు కూడా  ఉండకూడదని కోరుకుంటున్నావ్ .  ఆరాటపడుతున్నావ్ . నీ దయాగుణం, ఇతరుల గురించి ఆలోచించే తత్త్వం నాకు చాలా నచ్చాయ్  రా ‘ అన్నాడు సూర్యుడు. కొన్ని క్షణాలు చింటూ కేసి తదేకంగా చూసి  ‘ఎవరికీ ఎండా దెబ్బ తగల కుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పనా .. ‘ ఆగాడు
‘ఊ .. చెప్పు చెప్పు .. ‘ చింటూ లో ఆత్రుత
‘చెట్లు నరకకుండా చూడండి. వేలవేలుగా చెట్లు నాటి పెంచండి . చెరువులు తవ్వండి. ప్రతి నీటి చుక్కని కాపాడండి . అవి మిమ్ముల్ని కాపాడతాయి… ‘ అని సూర్యుడు చెప్తున్నాడు .  అంతలో  ‘చింటూ… ఎండలోకి వెల్లొద్దన్ననా .. ‘అమ్మ కోపంగా గట్టిగా అరుస్తూ రావడంతో లోపలి పరిగెత్తాడు చింటూ .
సూర్యుడు చెప్పిన మాటలు చింటూ చెవిలో మారుమోగుతుండగా నేను చెట్లు నాటతాను . నా ఫ్రెండ్స్ తో కుడా చెప్పి నాటిస్తా .. నాకు తెలిసిన వాళ్ళందరికీ సూర్యుడు చెప్పిన మాటలు చెప్తాను అని  మనసులోనే ప్రతిజ్ఞ చేసుకున్నాడు చింటూ

వి. శాంతి ప్రబోధ

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

3 thoughts on “ఎండదెబ్బ

 • March 22, 2016 at 4:29 am
  Permalink

  పర్యావరణ పరిరక్షణ యొక్క ఆవశ్యకతను మీ కథ ‘ఎండ దెబ్బ’ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు ప్రబోధ గారు . అభినందనలు

 • March 22, 2016 at 5:09 am
  Permalink

  Thank you Madam

 • April 2, 2016 at 12:56 am
  Permalink

  విజ్ఞాన దాయకమైన కథ . అభినందనలు శాంతి .. కొత్త రూపంతో జాబిల్లి చాలా బాగుంది . శివ గారికి అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *