ఆ యువరాజు – ఈ యువవాణి | బివిడి.ప్రసాదరావు

అనగనగా ఒక రాజ్యం.
ఆ రాజ్యంకు ఒక రాజు.
ఆ రాజుకు ఒక కొడుకు.
ఆ కొడుకు పేరు యువరాజు.
ఆ యువరాజుకు వయస్సు ముప్పైయేళ్లు.

ఆ యువరాజు సామాన్యం లగాయితు రాజ్యనీతిశాస్త్రం వరకు అత్యుత్తమ విద్యావంతుడు అయ్యాడు. వినయవంతుడుగా మన్ననలు పొందాడు. ప్రజల పక్షపాతిగా గుర్తింపు పొందాడు. సాహిత్య సంగీత చిత్రలేఖనాల ప్రీతిపాత్రుడుగా కీర్తింపబడ్డాడు. యుద్ధాల ప్రావీణ్యుడుగా శభాష్ అనిపించుకున్నాడు. పైగా అందగాడు, నిలువెత్తువాడు, కొట్టొచ్చేలా కనిపించే ఠీవి అగుపర్చేవాడు. అదీ ఇదీ అని ఏమిటి సమస్త మంచిలరాశి అని అనవచ్చు అతనిని గూర్చి.
ఆ రాజ్య పాలనా వ్యవస్థ ప్రకారం ఆ యువరాజు ఆ రాజ్యంకు ఇక రాజు అవ్వాలి. కానీ, అందుకు అతను ససేమిరా ఒప్పుకోవడం లేదు.
ఎంత అడిగినా, ఎందరు అడిగినా, అందుకు కారణం వెల్లడి చేయుట లేదు అతను.

చివరాఖరుగా, నిండు సభన, ఆ యువరాజు తండ్రి, ఆ యువరాజుతో “నువ్వు రాజుగా ఈ రాజ్యంలో ఉండు లేదా ద్రోహిగా ఈ రాజ్యం విడిచిపో” అని చెప్పేశాడు.
ఆ సభ గగ్గోలు పెట్టింది.యువరాజు తల తిప్పుతూ అక్కడ జనాలందర్నీ చూశాడు. అలానే తన తండ్రిని చూశాడు. తర్వాత తల్లిని చూశాడు.
ఆ తల్లి కళ్లల్లోంచి దిగజారుతున్న ఎడతెరిపిలేని కన్నీళ్లను చూస్తున్నాడు. కదిలాడు. ఆ తల్లి చెంత మోకాళ్ల మీద కూర్చున్నాడు. ఆమె అర చేతుల్ని తన అర చేతుల్తో పట్టుకున్నాడు.

చెప్పాడు, “అమ్మా. ఇప్పుడు నీకు నేను సమాధానం చెప్పాలి.” అని అని, తండ్రి వంక చూపుతూ, “ఆ సింహాసనాన్ని అధిష్టించటానికి నేను నిజంగా అనర్హుడని. ఎంచేతంటే…” అంటూ, తన కుడి అర చేతిని చూపుతూ, “నాకు ఇక్కడ బొటన వేలు లేదు. నాకు విలు విద్య లేదు. పరిపూర్ణత లేని నేను రాజుకు అర్హుడిని కాను.” అని.

ఆ తల్లి ఏమీ మాట్లాడలేదు.
ఆ యువరాజు తండ్రి మాత్రం మాట్లాడేడు, “లేదు నాయనా. అది నీ భావన. మన రాజ్య పాలనా వ్యవస్థ ప్రకారం అట్టిది ఏమీ లేదు” అని అన్నాడు.
యువరాజు మాట్లాడలేదు.

ఆ సభలో వారు, “అది అనర్హత కాదు. అది అనర్హత కాదు. మీరే మా రాజు. మీరే మా రాజు” అన్నారు ఒక్కమారుగా.
రాజుగారు చేయి ఊపడంతో ఆ సభ సద్దుమణగింది.

రాజు, “యువరాజా, మీకు నేటి నుండి వారం దినాల సమయం ఇస్తున్నాం. మీరు పునరాలోచన చేసి చెప్పిండి. మీరు మా మాట ఆలకిస్తారనే మేము భావిస్తున్నాం” అన్నాడు.
ఆ సభ ముగిసింది.
***
అనగనగా అదే రాజ్యం.
ఆ రాజ్యంలో ఒక కుటుంబం.
ఆ కుటుంబంలో ఒక అమ్మాయి.
ఆ అమ్మాయి పేరు యువవాణి.
ఆ యువవాణికి వయస్సు ఇరవైఐదేళ్లు.
ఆ యువవాణి సామాన్యమైన చదువరి. తెలివైనది. భయం లేనిది. తన మీద తనకు ఎక్కువ నమ్మకం ఉన్నది. ఇతరుల మాట పెడచెవిన పెట్టేది. తను అనుకున్నదే చేసేది. పైగా అందగత్తె, మంచి ఒడ్డూ పొడుగు ఉన్నది. కొట్టొచ్చేలా కనిపించే తీరు అగుపర్చేది. అవీ ఇవీ అని ఏమిటి ఒక పెంకిఘటం అని అనవచ్చు ఆమెను గూర్చి.

ఆ కుటుంబ అణుకువ ప్రభావం ఆ యువవాణి మీద రవ్వంత పడలేదనే చెప్పాలి. అందుకు మచ్చు ఆమె తెగని మొండితనమే.
ఎంత చెప్పినా, ఎందరు చెప్పినా, ఆమె తీరులో రవ్వంత మార్పు రాలేదు.
చివరాఖరుగా, కుటుంబ సర్వ సభ్యుల సమక్షాన, ఆ యువవాణి తండ్రి, ఆ యువవాణితో “నువ్వు మంచిగా ఉంటే బావతో మనువాడించి ఈడ ఉండనిస్తాను లేదా ఎవడికో కట్టబెట్టి ఏడకో పంపేస్తాను” అని చెప్పేశాడు.
ఆ సభ్యులు గుసగుసలాడుతున్నారు.

యువవాణి తల తిప్పుతూ అక్కడ వారందర్నీ చూసింది. అలానే తన తండ్రిని చూసింది. తర్వాత తల్లిని చూసింది.
ఆ తల్లి కళ్లల్లోంచి దిగజారుతున్న ఎడతెరిపిలేని కన్నీళ్లను చూస్తుంది. కదిలింది. ఆ తల్లి చెంత మోకాళ్ల మీద కూర్చుంది. ఆమె అర చేతుల్ని తన అర చేతుల్తో పట్టుకుంది.

చెప్పింది, “అమ్మా. ఇప్పుడు నీకు నేను విషయం చెప్పాలి.” అని అని, తండ్రి వంక చూపుతూ, “ఆయన వలనే నేను ఇలా అయ్యా. ఎలాంటే…” అంటూ, తన ఎడమ అర చేతిని చూపుతూ, “ఈ మచ్చ చూడు. ఇది ఆయన పెట్టిన వాత గుర్తు. అప్పుడు నేను ఒక చిన్నపిల్లని అని కూడా ఆయన చూడలేదు. అంతా ఆయన అభీష్టం ప్రకారమే నడుచుకు తీరాలి అంటారు. అదే నాకు నచ్చలేదు. అందుకే నన్ను నేను ఇలా తీర్చిదిద్దుకున్నాను” అని.
ఆ తల్లి ఏమీ మాట్లాడలేదు.

ఆ యువవాణి తండ్రి మాత్రం మాట్లాడేడు, “నాకు క్రమశిక్షణ అంటే ప్రాణం. దానిని నువ్వు ఉల్లఘించే దానివి. నిన్ను నువ్వే పాడు చేసుకున్నావు” అని అన్నాడు.
యువవాణి మాట్లాడలేదు.

ఆ సభ్యులు, యువవాణితో, “రాజు కొలువులో ఉద్యోగి కావడంతో ఆయనకు అట్టి క్రమశిక్షణ అబ్బేసింది. నువ్వే అర్ధం చేసుకోలేదు.” అన్నారు గోలగా.
ఆ తండ్రి చేయి సైగతో ఆ గోల సద్దుమణగింది.

తండ్రి, “యువవాణీ, నీకు నేటి నుండి ఏడు దినాలు సమయం ఇస్తున్నాను. ఇదే నీకు చివరి అవకాశం. నీవు నా మాట వింటావనే నేను భావిస్తున్నాను” అన్నాడు.
ఆ సమావేశం ముగిసింది.
***
అనగనగా ఒక అడవి.
ఆ అడవికి తూర్పు వైపున ఉంది మనం ఊసులాడుతున్న ఆ రాజ్యం.
ఆ అడవికి మిగతా మూడు వైపులను కలుపుకుంటూ నిండుగా పారుతోంది ఒక నది.
ఆ అడవి పాలన, తరతరాలుగా ఈ రాజ్యం పాలకులుదే.

ఆ రాజ్యం పూర్వపు రాజులు, వ్యయ ప్రయాసలకు తగ్గక, ఆ అడవిలోని క్రూర జంతువులను నేర్పుగా, ఓర్పుగా ఆ నదిని దాటించి, ఆవలి వైపు ఉన్న ఎత్తైన కొండల్లోకి తోలేశారు. దాంతో ప్రస్తుతం ఆ అడవిలో దుప్పి, జింక, కుందేలు లాంటి సాధు జంతువులే సంచరిస్తున్నాయి, స్వేచ్ఛగా.
అలానే, ఆ రాజ్యం వారు, తమకు, చక్కని చల్లని వాతావరణం, సకాల వర్షాలు ఆ అడవి మూలంగానే అందుతున్నాయని విశ్వసిస్తున్నారు. దాంతో ఆ అడవి అంటే వారికి మిక్కిలి మక్కువ.

ఆ భావనతోనే, ప్రతి యేటా, తొలి పౌర్ణమి రోజున, ఆ అడవీ ప్రాంతాన వన మహోత్సవం పేరిట రంగ రంగ వైభవంగా ఒక జాతర నిర్వహించు కుంటారు.
అలాగే ఆ రోజు మినహా మరే రోజునా ఎవరూ ఆ అడవికి పోరాదని, ఆ అడవి సంపదను ఎవరూ వ్యక్తిగతంకై వినియోగించుకోరాదని కఠిన శాసనం ఒకటి చేసి పెట్టుకున్నారు ఎప్పుడో. అది మీరిన వారికి వంద కొరడా దెబ్బలు తప్పనిసరనీ ఒక నియమం కూడా పెట్టుకున్నారు.

అలాగే ప్రతి యేటా, జాతరకు రెండు రోజులు ముందున, రాజుచే నియమింప బడ్డ సభ్యులు మాత్రమే, ఆ అడవికి వెళ్లి, అప్పటికి ఆ అడవిలో విరిగిన చెట్లును, కొమ్మలను, రాలిన ఆ అడవి ఫలసాయంలోని ఉపయోగపడే వాటిని సేకరించి, సభా సమక్షాన, వాటిని వేలం పాటతో అమ్మి, ఆ వచ్చిన మొత్తాన్ని ఖజానకు చేర్చి, దానిని ఆ అడవి సంరక్షణకే వినియోగించుకుంటారు.
***
యువరాజు, యువవాణిలకు తమ పెద్దలు ఇచ్చిన గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తుంది.
అప్పటికి ఆ రాజ్యం వారు నిర్వహించుకున్న వనమహోత్సవం ముగిసి నలబై రోజులు కావస్తుంది.
మరి తమ మాట వినుకోరని తలచిన యువరాజు, యువవాణి కాకతాళీయంగానే, తమ ఇళ్లను విడిచి, ఎవరి దారిన వారు, అతి జాగ్రత్తలతో, వేగుల కంట పడక, ఆ అడవిలోకి చొరపడిపోయారు, గడుస్తున్న నేటి మధ్య రాత్రిన.

అప్పటికి వారు, తర్వాత ఏం చెయ్యాలో అన్నది ఏమీ ఆలోచించుకొని లేరు. మొదట తమ పెద్దల తీవ్ర చర్యలకు బలి కాకూడదనే అనుకున్నారు. అలా ఆ అడవిలోకి వచ్చేశారు.

ఎవరు పట్టిన దారంట వారు ముందుకు నడుస్తున్నారు. చెట్ల పై సందుల్లోంచి మసక మసక వెలుతురు నేలన మరకల్లా కాన్తోంది. దారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి.

అలానే వారు, అక్కడి చలిని చవి చూస్తున్నారు. భీతిని భరిస్తున్నారు. ఉండి ఉండి వినవస్తున్న చప్పుళ్లును ఆలకిస్తున్నారు. ఐనా తెగింపుగా ముందుకు సాగుతున్నారు.

ఎంత తలవని తలంపుగా వారు ఇరువురు అడవిలోకి వచ్చేశారో, అంతే మాదిరిగా వారు ఇరువురు ఒకరికి ఒకరు తారస పడ్డారు, ఆ అడవి మధ్యన, తెలతెల వారుతుండగా.

ఆ ఇరువురూ ఒకర్ని ఒకరు చూసీచూసుకోగానే అదిరిపోయారు, ఆశ్చర్యపోయారు.
ముందుగా తేరుకొని, యువరాజు, “ఎవరు నువ్వు. ఇక్కడకు ఎలా రాగలిగావు” అన్నాడు, కాస్తా దర్పముగానే.
అందుకు ఒళ్లు మండింది యువవాణికి. దాంతో, “చాల్లెండి. ఇక్కడ రాచరికము ఎందుకు కానీ, తగ్గండి. తమరు కూడా ఇక్కడకు రావడం తప్పే. కాదా.” అంది, వెంటనే.

“సరిసరే. నన్ను ఎఱుగుదువా. ఇంతకీ ఎవరు నువ్వు.” అని అడిగాడు యువరాజు.
“నేను తమరి రాజ్యంలోని ఒక మనిషిని. తమరు నాకు తెలుసు. మిమ్మల్ని కొన్ని మార్లు నేను చూడగలిగాను” అని చెప్పింది యువవాణి.
“అటులనా. ఐనా నువ్వు ఇటు ఎందుకు వచ్చావు” అని అడిగాడు యువరాజు.
జవాబు చెప్పక, “తమరు ద్రోహిగా గెంటింపబడలేక ఇలా వచ్చేశారా” అని అడిగింది యువవాణి, విడ్డూరంగా.
యువరాజు విస్మయంగా ఆమెను చూశాడు.

“ఎందుకు ఆ చూపు. నిండు సభలో జరిగినది నాకు తెలియడం విడ్డూరం కాదుగా” అంది యువవాణి, నవ్వుతూ.
యువరాజులో చిర్ర గుర్రుమంది. “సరిసరే. నువ్వు ఎందుకు ఇలా వచ్చావు” అని అడిగాడు.
“ఇప్పుడు తమరు ఆర్చగలరా, తీర్చగలరా. అది వదిలేయండి కానీ, మనం ఇప్పుడు ఆ నది దాటేది ఎలా. ఆ కొండలకు అటు ఉన్న ఊళ్లకు పోయేదెలా. అది తేల్చండి చాలు” అని అంది యువవాణి.

అప్పటికి కొద్ది మేరకు వెలుగు వచ్చేసింది.
“అది అంత సులభం కాదు కానీ, ముందు విశ్రాంతికై కూర్చుందాం” అన్నాడు యువరాజు. ఆ వెంటనే కొద్ది దూరం కదిలి, ఒక చెట్టు మొదటన కూర్చున్నాడు.
అతనికి కొద్ది దూరంలోనే యువవాణీ కూర్చుంది. తన పక్కన తనతో తెచ్చుకున్న మూటను పెట్టుకుంది.
“అదేమిటి” అడిగాడు యువరాజు.

యువవాణి, “తమరేం పట్టుకు వచ్చినట్టు లేదే. కనీసం బట్టలు తెచ్చుకోక పోతే ఎలా” అని అంది.
ఆమెను ఎగాదిగా చూశాడు యువరాజు.
“ఆభరణాలతో, కట్టు బట్టలతో తమరు వచ్చేశారు. భలే” అంది యువవాణి, వింతగా.
“నా ఆలోచనంతా అక్కడ నుండి వచ్చేయాలనే. అంతే. నువ్వు ఆలోచించుకొనే సరంజామాతో వచ్చేసినట్టు ఉన్నావు. ఇంతకీ నీ కష్టం, నష్టం ఏమిటి” అని అడిగాడు యువరాజు.

“సర్లే, చెప్పుతా వినుకోండి. పెళ్లి. మా వాళ్లు చెప్పినట్టు వింటే, బావతో పెళ్లి చేసి తమ దగ్గరే ఉంచుకుంటారట నన్ను. లేదంటే, బయటోడితో పెళ్లి చేసి, నన్ను ఆడకు పంపేస్తారట” అని చెప్పేసింది యువవాణి.
యువరాజు మాట్లాడలేదు.

“నాకు తెలుసు. తమరు మరి మాట్లాడలేరు. అందుకే చెప్పనన్నాను.” అంది యువవాణి.
యువరాజు : “అదేమిటి. అంతలా అనేశావు”
యువవాణి : “మరి అంతేగా. మా వాళ్ల మాట వినాలి అని తమరు నాకు చెప్పలేరు. ఎందుకంటే తమరు మీ వాళ్ల మాట విన్నారా”
యువరాజుకు అర్ధమైంది యువవాణి తీరు. తను చెప్తే ఆలకించే రకంలా ఆమె లేదనుకున్నాడు. అలానే, తన మాటే ఆలకించాలనే రకమని కూడా ఆమెకై అనుకున్నాడు.

“సర్లే కానీ. ఒకటి చెప్పిండి. విలు విద్య లేనంత మాత్రాన రాజ్యాన్ని తమరు ఏలలేరా” అని అడిగింది యువవాణి, అప్పుడే.
యువరాజు మాట్లాడలేదు.
“తమరి రాజ్యంలో యుద్ధాలు ఎప్పుడో జరిగాయట. అదీన్నూ తమరు, నేను పుట్టక ముందెప్పుడునో. పైగా దోపిడీలు, దొంగతనాలు, అంత ఎందుకు తగాదాలు, దొమ్మీలు లాంటివి ఏమైనా జరిగాయా మన రాజ్యంలో. మన చిన్ననాటి నుండి మనకు అట్టి ఎఱికలు లేనే లేవు కదా. అటువంటప్పుడు, పోరు ఆలోచన అవసరం ఎందుకు. అలాగే విలు విద్య అవసరం ఎందుకు. ప్రజలు బాగుకు సరిపడ్డ సామర్ధ్యం ఉన్న తమరు రాజ్యాన్ని ఏలే ఆలోచనలో లేనట్టుంది. అందుకేనేమో విలు విద్య లోటును ఒక వంకగా చూపి పోతున్నారు” అని అనేసింది యువవాణి.
యువరాజుకు కోపం వచ్చింది. దానిని చూపులతో చూపాడు.
“బుసలాపి విషయం తేల్చండి.” అని అంది యువవాణి.

యువరాజు అల్లకల్లోలం అవుతున్నాడు.
“కుదుట పడండి. మీ పని సరైనదే ఐతే తమరు ఇంతగా కదిలిపోనక్కర లేదుగా.” అంది యువవాణి.
“నాకు విలు విద్య లేకపోవడం ఒక అనర్హత అనిపించింది. రాజుకు అన్నీ ఉండాలి” అన్నాడు యువరాజు, విసురుగా.
“అవునా. అలా ఐతే, తమరుకు దొంగతనం, అబద్ధాలాడడం లాంటివన్నీ తెలుసా” అని అడిగింది యువవాణి.
“ఛఛ. అదేమిటి” అన్నాడు యువరాజు, గబుక్కున.

“అయ్యా, తమరేగా అన్నారు, రాజుకు అన్నీ ఉండాలి అని” అంది యువవాణి.
“అయ్యో, నా ఉద్దేశ్యం అది కాదు…” అని ఇంకా ఏదో చెప్పబోతున్న యువరాజుకు అడ్డు తగిలి –
యువవాణి, “తమరి ఆలోచన శుద్ధ తప్పు. పోనీ మీరు అనుకున్నట్టు విలు విద్య ఉండాలి అంటే, ఏం పోయింది, ఎడమ చేయి బొటన వేలు ఉందిగా తమరుకు. ఎడమ చేతి వాటం నేర్చుకోండి. అది అసాధ్యమా” అని అడిగింది.
యువరాజు మాట్లాడలేదు.
పిమ్మట, వాళ్ల మధ్య చాలాసేపు మాటలు లేవు.

తర్వాత, “తమరు ఇంతగా యోచన చేస్తున్నారంటే, నా వాదన సరైనదే నన్నది నేను అనుకుంటున్నాను” అని చెప్పింది యువవాణి.
యువరాజు తలెత్తాడు. యువవాణిని చూస్తూ, “నిజమే. నువ్వు చెప్పినవన్నీ ముమ్మాటికీ నిజమే. అలాగే నీ వాదనని నేను సమ్మతిస్తున్నాను” అని అనేశాడు.
“ధన్యోస్మి.” అని అని, “హమ్మయ్యా, ఇంత వరకు నాకు నచ్చినట్టే నేను చేస్తున్నా ఏదో తెలియని వెలితి. అది ఇప్పుడు మీ మూలాన పటాపంచలయ్యింది. సంతోషం. ఇక ఆలస్యం వద్దు. రాజ్యంలో మీ జాడ తెలియక, గగ్గోలు కాక మునుపే తమరు తిరిగి రాజ్యంకు వెళ్లండి. ఇక అంతా సజావు చేయండి” అని కూడా అంది యువవాణి.

యువరాజు, “మరి నువ్వు” అని టక్కున అడిగాడు.
యువవాణి ఏమీ మాట్లాడలేదు.
“నువ్వూ నాతో తిరిగి రాజ్యం వచ్చేయ్” అని అనేశాడు యువరాజు.
“తమరుకు కుదిరింది. నాకు కుదరదు. మా వాళ్లు అన్న పని చేస్తారు. అది నాకు వద్దు. అది నాకు ఇష్టం కాదు” అని చెప్పింది యువవాణి.
ఆ వెంటనే, యువరాజు, “నువ్వు కూడా రాజ్యంలోనే ఉండవచ్చు” అని చెప్పేశాడు.
“ఎలా” అని అడిగింది యువవాణి, గబుక్కున.
“నీ తోడు నాకు కావాలనిపిస్తోంది, కాదు కాదు, అవసరమనిపిస్తోంది. కనుక, నిన్ను నేనే పెళ్లి చేసుకుంటాను” అని చెప్పాడు యువరాజు, సౌమ్యంగా.
యువవాణి బిత్తరపోయింది.
యువరాజు నిల్చున్నాడు.

“లే. తిరిగి రాజ్యం పోదాం” అని అన్నాడు.
యువవాణి : “ఆజ్ఞా”
యువరాజు : “వేడుకోలు”
యువవాణి : “మనకు పెళ్లి సాధ్యమవుతుందా”
యువరాజు : “నేను జరిపించుకుంటానుగా.”
యువవాణి నిల్చుంది. తన మూటను తీసుకుంది.
యువరాజు చిన్నగా నవ్వుకున్నాడు. పిమ్మట, ఆమె చేతిని పట్టుకొని కదిలాడు, రాజ్యం వైపు.
***

ఇప్పుడు ఆ రాజ్యం ఆ యువరాజు పాలనలో, ఈ యువవాణి నేతృత్వంలో కళకళలాడిపోతోంది.
అంతకు కొన్నాళ్లు మునుపు, అడవి నుండి తిరిగి రాజ్యానికి వచ్చేసిన ఆ ఇరువురు, వెనువెంటనే తమ పెద్దల సమక్షాన, యువవాణి చొరవతో, జరిగింది జరిగినట్టు తమ నిర్వాకాన్నంతటినీ వెల్లడి చేసేశారు. పిమ్మట తమ పెళ్లికి తమ పెద్దల అంగీకారం కూడా పొందారు. అలాగే అప్పటి తమ అడవి చొరబాటుకు శిక్షనూ స్వీకరించారు. కానీ, అప్పటి ఆ అడవి పరివేక్షణ చూస్తున్న వేగుల్ని మందలించి, ఆ పని నుండి వారిని మరో పనికి బదిలీ చేసి, మరింత కట్టుదిట్టమైన సూచనలతో, కొత్త వేగుల్ని ఆ అడవి పరివేక్షణకై నియమించారు. వారి పాలనా పటిమ మొదలైంది కూడా అప్పటి నుండే.
***

బివిడి.ప్రసాదరావు

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

8 thoughts on “ఆ యువరాజు – ఈ యువవాణి | బివిడి.ప్రసాదరావు

 • September 10, 2017 at 11:34 pm
  Permalink

  Katha baagundi.

 • September 10, 2017 at 11:43 pm
  Permalink

  కథలో మంచి సందేశం ఉంది. రచయితకు అభినందనలు.

 • September 11, 2017 at 12:49 am
  Permalink

  Kadha maaku baga nachhindi

 • September 11, 2017 at 1:35 am
  Permalink

  సందేశాత్మక కథ. బాగుంది.

 • September 11, 2017 at 4:58 am
  Permalink

  చక్కని కథ.

 • September 11, 2017 at 8:29 pm
  Permalink

  Kadha, kadanam saralamga baagunnai. Nice.

 • September 12, 2017 at 2:16 am
  Permalink

  కథ నచ్చింది

 • September 14, 2017 at 11:58 pm
  Permalink

  కథ చక్కగా సందేశాత్మకంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *