ఉడత భక్తి | ఆదూరి. హైమావతి

తూబరహళ్ళి అనే గ్రామంలో తంబప్ప అనే ఒక వ్యక్తి ఉండేవాడు. పసి తనం లో స్కూల్ కెళ్లక పోడంతో ఓ.న. మా లు కూడా రాలేదు . తల్లీ తండ్రి గతించడంతో పొట్ట నింపుకోను ఏమి చేయాలో తోచక ఆకలి కడుపుతో నిద్రిస్తుండగా , ఆరాత్రి కలలో అమ్మా అయ్యా కనిపిం చారు.

“ఓరీ తంబా ! ఒక్కనాడైనా బడికెళ్ళక ముక్క చదువు నేర్వక పోతివిరా! ఎట్టా బతుకుతావురా బిడ్డా! అడివి కెళ్ళి మనింటో ఉన్న గొడ్దలితో ఎండిన కొమ్మలు నరికి తెచ్చుకుని ఊర్లో అమ్ముకో , వచ్చిన సొమ్ముతో పొట్ట నింపుకో. చెడ్ద పనులు సేయ మాకు.ఎవ్వరికీ అపకారం సేయ మాకు. చిన్న జీవికైనా చేతైన సాయం సెయ్యి. ఆదేవుడే నిన్ను కాస్తాడు” అనిచెప్పారు.

ఉదయం లేవగానే తండ్రి కట్టెలు కొట్టే గొడ్డలి బుజానేసుకుని అడవి దారి పట్టాడు.దార్లో ఉన్న బాహుదానది లో పొట్ట నిండా నీరు త్రాగుతుండగా ,దూరంగా నీటిలో కొట్టు కొస్తున్న ఒక ఉడుతను చూశాడు. నీటి ప్రవాహం వేగంగా ఉండటాన ఆ ఉడుత బయటికి రావాలని ఎంత ప్రయత్నించినా నీటి వాలుకు కొట్టుకు పోసాగింది. తంబప్ప వెంటనే దగ్గరగా ఉన్న ఒక చెట్టు పొడవాటి ఎండు కొమ్మను నరికి నీటి వాలుకు వదిలాడు.ఆ ఉడుత ఆ కొమ్మ పైకెక్కి , కొమ్మ గట్టుకు సమీపానికి రాగానే బయ టికి దూకేసింది.

తంబప్ప ఆ ఉడుతను చేతుల్లోకి తీసుకుని తన తల గుడ్డ తీసి దాని ఒళ్ళు తుడిచాడు. ఉడుత కృతఙ్ఞతా పూర్వకంగా తంబప్పను ప్రేమగా చూసింది. తంబప్ప దాని వీపు మీద ప్రేమగా నిమిరి దాన్ని వదిలేసి ఎండు కొమ్మలకై వెతుకుతూ బయల్దేరాడు.

ఉడుత అతడికి ముందుగా పరుగెడుతూ వెనక్కు తిరిగి చూస్తూ వెళ్లడం వానికి వింతగా అనిపించి ఏమవు తుందో చూద్దామని దాని వెనకాలే వెళ్లసాగాడు. కొద్దిదూరం వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద ఎండు మాను ఉంది. ఉడత దాని వద్దకెళ్ళి ఆగిపోయింది. తంబప్ప చాలా ఆశ్చర్యపడ్దాడు.

తనకు ఎండు మాను చూపను అలా వెనక్కి తిరిగి చూస్తూ వచ్చిందని అర్ధమై ఆ చిరుప్రాణి తనకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం చూసి చకితుడయ్యాడు. తల్లీ తండ్రీ రాత్రి చెప్పినమాట వినడం వల్ల ఈ రోజు తనకు ఇంత మేలు జరిగిందని భావించి, అప్పటి నుంచీ అందరికీ, చివరకు చీమంత చిన్నప్రాణికైనా సాయం చేస్తూ కట్టెలు కొట్టుకుని అమ్ముకుంటూ జీచించసాగాడు.
నీతి- చేసిన మేలు చిన్నదైనా మనకు తిరిగి మేలే జరుగుతుంది.

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *