కిట్టూ ది గ్రేట్ | బివిడి.ప్రసాదరావు

ఆ రోజు ప్రతి రోజులాగే బయలు దేరాడు కిట్టూ, సైకిల్ మీద కాన్వెంట్ కు.
కొంత దూరం వచ్చాడో లేదో పిలిచినట్టు కావడంతో ఆగాడు.
చెట్టు చాటు నుండి ఓ వ్యక్తి వస్తూ కిట్టూ కాన్వెంట్ పేరు చెప్పి, “అక్కడ ఓ కానిస్టేబుల్ ఉంటాడు. అతడికి ఇది ఇవ్వు” అంటూ ఓ చిన్న బాక్స్ ను కిట్టూ పుస్తకాల బేగ్ లో నేర్పుగా సర్దాడు.
“ఆ కాన్వెంట్ కే నేను వెళ్తున్నానని మీ కెలా తెలుసు” అడిగాడు కిట్టూ.
“మీ యూనిఫాం బట్టి” చెప్పాడు అతడు.
“ఇంతకీ మీ రెవరు?”
“మఫ్టీలో ఉన్న మరో కానిస్టేబుల్ ని.”
“అద్గదీ, పోలీసు వారా. ఇంతకీ ఏమని చెప్పాలి? ఎవరని చెప్పాలి”
“చూడు బాబూ, మీ కాన్వెంట్ గేట్ దగ్గర ‘త్రిబుల్ ఫోర్’ ఉన్న బిళ్లతో ఓ కానిస్టేబుల్ ఉంటాడు. ‘త్రిబుల్ సిక్స్’ ఇచ్చాడని ఇవ్వు. నేను అర్జెంట్ గా యస్సై గారిని కలుసుకొని వస్తానని చెప్పు, చాలు. సరేనా” అన్నాడు అతడు.
***

“మీకు ‘త్రిబుల్ సిక్స్’ తెలుసా?” అడిగాడు కిట్టూ, కాన్వెంట్ గేట్ వద్ద పోలీస్ యూనిఫాం లో ఉన్నతన్ని.
“తెలుసు, తెలుసు. ఏం బాబూ, అతడు ఏదైనా ఇచ్చాడా నీకు, నాకు ఇమ్మన మని” ఆతృతగా అడిగాడు ఆ త్రిబుల్ ఫోర్.
“అవును. మీకు ఇమ్మనమని ఏదో ఇచ్చారు. నా బ్యాగ్ లో పుస్తకాలు ఎక్కువగా ఉండడంతో మా ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టాను. వాడు తన మామయ్య మోటర్ బైక్ మీద ముందు వచ్చేశాడు. రండి మా క్లాస్ లో ఉంటాడు వాడు. తీసుకొని ఇస్తాను” చెప్పాడు కిట్టూ.
“నేను ఇక్కడ ఉంటాను. వెంటనే తెచ్చేయమ్మా.” అన్నాడు త్రిబుల్ ఫోర్.
“ఏమిటి సార్, పోలీస్ వారై ఉండి మీకు భయమా?” అన్నాడు కిట్టూ.
“భయమా. అబ్బే, నన్ను చూసి మీ పిల్లలు భయపడతారని” చెప్పాడు త్రిబుల్ ఫోర్.
“ఫర్వాలేదు. రండి సార్. టైం అయిపోయింది. వినండీ, ‘ప్రార్థన గంట’ అవుతోంది”
“సరే పద”
త్రిబుల్ ఫోర్ నడిచాడు కాన్వెంట్ లోనికి కిట్టూతో.
ప్రార్థన స్థలం మధ్యకు వచ్చే సరికి కిట్టూ – “వీడు దొంగ పోలీస్. పట్టుకొండి. ప్లీజ్” అని అరవడంతో, అక్కడ గుమ్ముకూడి ఉన్న స్టూడెంట్స్ అంతా గమ్మున ఆ త్రిబుల్ ఫోర్ ను వాటేసి పట్టుకోవడం జరిగిపోయాయి క్షణాల్లో.
కిట్టూ కోరికతో త్రిబుల్ ఫోర్ ను తమ డైరక్టర్ ముందు నిలబెట్టారు అంతా.
కిట్టూ అంత వరకు జరిగిందంతా చెప్పాడు.
పిమ్మట, “సర్, నాకు వీళ్ల ప్రవర్తన అనుమానం కలిగించింది. అందుకే ఆలోచించి, నేర్పుగా ఇతన్ని పట్టుకో గలిగాను.” అని, తన పుస్తకాల బ్యాగ్ లోనించి త్రిబుల్ సిక్స్ ఉంచిన బాక్స్ ను తీసి, డైరక్టర్ కు ఇచ్చాడు.
డైరక్టర్ దాన్ని తెరవడానికి ప్రయత్నించాడు. అది తెరవబడ లేదు.
“సర్, వీడు మెంటల్ స్టూడెంట్ లా ఉన్నాడు. అది నా బాక్స్. దాంట్లో నా తిండి ఉంది. దాన్ని ఇలా ఇవ్వండి” అన్నాడు త్రిబుల్ ఫోర్.
“మీదే పోలీస్ స్టేషన్?” డైరక్టర్ ప్రశ్నించాడు.
త్రిబుల్ ఫోర్ చటుక్కున చెప్పాడు – “టూ టౌన్ సర్”
డైరక్టర్ ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుండగా – “వన్ టౌన్ సర్, మా యస్సై గారు లేరు. క్యాంపులో ఉన్నారు” అన్నాడు త్రిబుల్ ఫోర్. అతడి మొహం ఆందోళనతో ఎరుపెక్కుతుండడం గమనించారంతా.
“ఇతడి చర్యలు అనుమానంగా ఉన్నాయి. వీడ్ని పట్టుకోండి” అంటూ స్టాఫ్ ను ఎలార్ట్ చేశాడు డైరక్టర్.
***

పోలీసులు వచ్చారు – డైరక్టర్ ఫోన్ మెసేజ్ తో.
పరిశీలనలో వాళ్లు – ఆ నకిలీ పోలీస్ లు, ‘స్మగ్లింగ్ గ్యాంగ్’ వారని నిర్ధారించ గలిగారు.
***

“నీకు అనుమానం ఎలా వచ్చింది” కిట్టూని అడిగారు యస్సై.
“పోలీసులు మా కాన్వెంట్ వద్ద ఎందుకు! అలాగే త్రిబుల్ సిక్స్ – ‘అతడు నా చేతికి బాక్స్ ఇవ్వక, నా బ్యాగ్ లో ఎందుకు సర్దాలి’ అని అనిపించింది. అలాగే త్రిబుల్ ఫోర్ యూనిఫాంలో తేడా కనిపించింది. నెంబరు ప్లేట్ కాక, అట్టముక్క మీద నెంబరు రాసి ఉంది. అందుకే వీళ్లను అనుమానించాను. నా ఆలోచన నిజమైంది” చెప్పాడు కిట్టూ.
***

“కిట్టూ యూ ఆర్ ఎ గ్రేట్ అండ్ బ్రేవ్ బోయ్. కీపిటప్”
“థ్యాంక్యూ సార్” అంటూ పోలీస్ ఆఫీసర్ నుండి షేక్ హాండ్ అందుకున్నాడు కిట్టూ.
***

జాబిల్లి బాలల డిజిటల్ పత్రిక

5 thoughts on “కిట్టూ ది గ్రేట్ | బివిడి.ప్రసాదరావు

 • October 21, 2017 at 5:57 am
  Permalink

  మా నానీకి బాగా నచ్చింది. మాకూ నచ్చింది.

 • October 21, 2017 at 6:30 am
  Permalink

  Nice

 • October 21, 2017 at 7:29 am
  Permalink

  Good. The best story.

 • October 21, 2017 at 8:23 am
  Permalink

  Superb

 • October 22, 2017 at 3:06 am
  Permalink

  Chakkani kadha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *