దున్నపోతులపోటీ
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
Chief Editor
Itsvizag.com
చాలా కాలం క్రితం ఒక రాజ్యం మీదకు మరొక రాజు దండెత్తి వచ్చాడు.అతని పేరు సనగర.ఆరాజ్యం లోని అన్ని ప్రాంతాలూ సనగరకు లొంగిపోయి దాసోహం అన్నాయి.కానీ,ఒక ప్రదేశంలోని వారు మాత్రం కొత్తరాజును ఎదిరించారు.దానితో కోపమొచ్చిన సనగర ఆ ప్రాంతం మీదకు సైన్యాన్ని పంపి మర్యాదగా లొంగకపోతే అందరినీ హతమారుస్తానని హెచ్చరించాడు.అక్కడి ప్రజలందరూ ఒకచోట సమావేశమై,ఏంచెయ్యాలి?ఏం చేస్తే తమ స్వాతంత్ర్యం నిలుస్తుందా అని చర్చించసాగారు.
‘మనం గనుక యుద్ధం చేస్తే ఎందరో ప్రాణాలు కోల్పోతారు, మన గ్రామాలన్నీ నేలమట్టమవుతాయి,మన కుటుంబాలన్నీ చెల్లాచెదురవుతాయి,అప్పటికీ ఎవరైనా మిగిలిఉంటే వారు బానిసలుగా బందీలవుతారు’ అంటూ ఆలోచించసాగారు.
ఇంతలో ఒక వృద్ధుడు పైకిలేచి,‘శత్రువుతో పోరాడేందుకు మనదగ్గర పటిష్టమైన ఆయుధాలు లేవు.కాబట్టి భుజబలంతో కాక,బుద్ధిబలంతో పోరాడాలి,గెలవాలి’అంటూ చెప్పుకొచ్చాడు.
అతని మాటకు అందరూ అంగీకరించి,ఒక నిర్ణయానికి వచ్చి,తమ తరపున ప్రతినిధులుగా కొందరిని సనగర దగ్గరకు పంపించారు.ఆ ప్రతినిధులు సనగరను కలసి,‘రాజా,యుద్ధం అంటూ జరిగితే,మీవైపు,మావైపూ,ఇరుపక్షాల సైనికులూ మరణిస్తారు.పైగా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది.కాబట్టి, మనం దున్నపోతుల పందెం పెడదాం,మీ దున్నపోతు గెలిస్తే మేమందరం మీకు లొంగిపోతాం.మా దున్నపోతు విజయం సాధిస్తే మమ్ముల్ని స్వతంత్రులుగా ఉండనివ్వండి’అంటూ కోరారు.

రాజు వాళ్ళు చెప్పిందంతా శ్రద్ధగా విని సైనికులను కోల్పోవటం కంటే,ఈ సూచన బాగా ఉందనుకుని,‘సరే,అలాగే చేద్దాం’అన్నాడు.పోటీకి ఒక రోజును నిర్ణయించుకున్నారు.వెంటనే రాజు తన సైనికులను రాజ్యం నలుమూలలకు పంపి,మాంచి బలమైన దున్నపోతును వెదికితెమ్మన్నాడు.సైనికులు మూలమూలలా గాలించి,బాగా ఎత్తు,బలిష్టంగా ఉన్న ఒక దున్నపోతును తెచ్చి,పశువుల శాలలో కట్టేసి,శ్రద్ధగా యుద్ధానికి సిద్ధం చేయసాగారు.
గ్రామప్రజలలో కొందరు వెళ్ళి రాజుగారి దున్నపోతును చూసివచ్చారు.‘అటువంటి దున్నపోతు మనకు ఎక్కడా దొరకదు,మనం ఓడిపోయినట్టేనని’నిరుత్సాహపడిపోయారు.వారిలో వారు కొందరు,మనం ముందు తీర్మానించిన విధంగా ఉపాయంతో గెలవాలి తప్ప,కండలు,బండలతో కాదన్నారు.అప్పుడు వాళ్ళు ఒక గేదెదూడను తల్లి నుంచి వేరుచేసి,కొమ్ములకు ఇనుపముళ్ళు అమర్చి,మూడురోజులపాటు,దాన్ని తల్లిదగ్గర పాలు తాగకుండా చేసి,ఆకలితో ఉంచారు.
పందెంరోజు వారు ఆదూడను తీసుకువెళ్ళి పోటీస్థలంలో నిలబడ్డారు.దున్నపోతుల పోటీ చూసేందుకు వచ్చిన జనం దూడను చూసి పగలబడి నవ్వారు.అందరూ మౌనం వహించాక గ్రామప్రజలు ‘మేము సిద్ధం’ అన్నారు.
సనగర సైనికులు తమ దున్నపోతును ముందుగా గోదాలోకి వదిలారు.తర్వాత గ్రామీణులు దూడను వదిలారు.మూడురోజులుగా పాలులేని దూడకు దూరం నుంచి దున్నపోతు తనతల్లిలాగా కనిపించటంతో పరుగుపరుగున వెళ్ళి పొదుగును కుమ్మింది.దున్నపోతుకు పాలపొదుగు ఉండదు కదా!కానీ!దూడకొమ్ముకు ఉన్న ఇనుపముళ్ళు దున్నపోతు కడుపును చీల్చేసాయి.తీవ్రమైన గాయాల పాలయ్యి,రక్తస్రావంతో రాజుగారి దున్నపోతు కిందపడి మరణించింది.సనగరకు విషయం అర్ధమై తనసైనికులను తీసుకుని వెళ్ళిపోయాడు.
——–
ఇండోనేషియా జానపధ గాధ ఆదారంగా..

ఐడియా బావుంది
1ఉపాయం బావుంది
2
3good,really nice
4