విస్తరాకు
విస్తరాకు
రచన : రాజేంద్ర కుమార్ దేవరపల్లి
![]()
ఒకరోజు కంచిల్ దారంటూ పోతూ ఒక రైతు ఇంటిలోకి తొంగిచూసింది. వేడివేడి కుడుములు విస్తరాకుమీద పెట్టి ఉన్నాయి. ఇంట్లో ఎవరూ లేరు. కంచిల్ మెల్లగా లోపలకు వెళ్ళి కుడుముల్ని ఆకుతో సహా నోటకరుచుకుని బయట ఉన్న పొలాల్లో నడుస్తూ తినసాగింది. తూరుపుగాలి విసురుకు విస్తరాకు కంచిల్ మొహమంతా కప్పేసింది. అయినా కంచిల్ అలాగే తింటూ నడవసాగింది.
కొంతదూరం పోయాక ఒకపొలంలో తీసిఉన్న నిలువెత్తు గోతిలో పడిపోయింది. కంచిల్ ఎంత ఎత్తయినా అవలీలగా దూకగలదు, కానీ ఆగోయి మాత్రం చాలా లోతుగా ఉంది. చేసేదేమీ లేక కంచిల్ ఆలోచిస్తూ కూర్చుంది. కంచిల్ తోపాటు గోతిలో పడిన విస్తరాకు గాలికి అటూ ఇటూ తిరుగుతుంది. అది చూసి కంచిల్ ‘దేవుడా, దేవుడా’అంటూ అరిచింది.
![]()
ఆ అరుపు విని అటువెళుతున్న బాబి అనే ఎలుగుబంటి గోతిలోకి తొంగిచూసి, ఎవరూ, దేవుడ్ని పిలుస్తున్నారు?’ అంటూ అడిగింది.
కంచిల్ తలయెత్తి విస్తరాకును చదువుతున్నట్టు తలతిప్పసాగింది.
‘విను,విను,దేవుడు ఏం చెపుతున్నాడో,ఈ వేళ దుర్దినం,ప్రళయం రాబోతుంది,తప్పించుకోవాలనుకుంటే ఈ గోతిలోకి వచ్చేయ్’అంది.
‘ఇవ్వాళ ప్రళయం అని ఎవరు చెప్పారు?అంటూ అడిగింది బాబి.
‘చూడు,ఈ పవిత్రగ్రంధంలో ఏంరాసుందో’,అంటూ రెట్టించింది కంచిల్.
‘నిజమేనా’అని అనుమానంగా అడిగింది బాబి.
‘అంటే,దేవుడిని,ఆయన శాసనాన్నే ధిక్కరించే దానివయ్యావన్నమాట’అంటూ గయ్యమని లేచింది కంచిల్.
‘అబ్బెబ్బే,అదేంలేదు,నేనుకూడా వస్తున్నా’అంది బాబి.
‘కానీ,నువ్వు శుభ్రంగా ఉన్నావా?అని ప్రశ్నించింది కంచిల్.ఉన్నానంది బాబి.‘కాదు,నువ్వెప్పుడూ జలుబుతో చీదుతుంటావు,కేవలం పరిశుభ్రంగా ఉన్నవారే ఇక్కడకు రావాలని దైవాజ్ఞ’అని హెచ్చరికగా అంది. కంచిల్.
‘అయ్యో,అలాంటిది ఏమీ లేదు,నేను చస్తే చీదను ’అంటూ బాబి గోతిలోకి దూకేసింది.
![]()
![]()
అదే వరుసలో మట్జన్ అనే పులి, గజ్డా అనే ఏనుగు కూడా గోతిలోకి దూకాయి.
కంచిల్ కొంతసేపు విస్తరాకు గ్రంధాన్ని చదువుతున్నట్టు నటిస్తూ కూర్చుంది. ఒక్కసారిగా గజ్డాను చూసి.‘ఏయ్,చూడబోతే తుమ్మేట్టున్నావ్, ముందు నువ్వు బయటకు ఫో’అంటూ అదిలించింది.ఆ దెబ్బకు అంతపెద్ద గజ్డాకూడా వణికిపోయి,‘ఎక్కడయ్యా,బాబు’అంది.బాబి,మట్జన్ లను కూడా లాగే హెచ్చరించింది కంచిల్.
అలా కొంతసేపు గడిచిందో లేదో,ఉండుండి ఒక్కసారిగా ‘హాఛ్’అంటూ పెద్దగా తుమ్మింది కంచిల్.దానితో మిగిలిన మూడు జంతువులూ కలసి,‘ఇంకేముంది,ఈ పవిత్రప్రదేశాన్ని అపవిత్రం చేసావు,నువ్వు ఇక్కడ ఒక్కక్షణం కూడా ఉంటానికి వీల్లేదు’అంటూ పైన నేల మీద పడేట్టు విసిరివేసాయి. కంచిల్ హాయిగా పాటపాడుకుంటూ ఇంటికి వెల్లిపోయింది.
కానీ,పాపం,బాబి,మట్జన్,గడ్జా!!
kanchil ante enti
1కంచిల్ = జింక
2