నాకీ తమ్ముడొద్దు!!
అమ్మ నిదురలేపలేదు
ముద్దులాడి పాలు పట్టలేదు
అసల్లమ్మ జాడే లేదు
చుట్టూ చీకటి
ఆకలేసి, భయమేసె
గట్టిగా అమ్మని పిలిచా
పాల గ్లాసట్టుకొని
పరుగున నానమ్మొచ్చె
అమ్మకి బాగా జరంట
పట్టణాస్పత్రిలో బాగయ్యి
తమ్ముడు కూడా పుట్టాకొచ్చేనట
ఆరేళ్ళకి మళ్లీ నట్టింట
కొత్త పాపాయి సందడంట
వారసుడట, వంశోద్ధారకుడట
అమ్మపై బెంగతో రోజూ గోలెట్టా
ఆపొద్దు నాన్నారు బుజ్జగించారు
తమ్ముడు పుట్టాడట తీసుకొస్తారట
అమ్మ రాకకై ఆశతో
రోజంతా ఎదురుచూపులు
నాన్నారు రాలేదు, అమ్మసలే రాలేదు
కోపమొచ్చి ఏడుపొచ్చె
నేనిదరోతే తెల్లారాక అమ్మొచ్చేనట
గట్టిగా కళ్ళు మూసి నిదరోయా
పాపాయి ఏడుపుకి ఉలిక్కిపడ్డా
నానమ్మ వొడిన తమ్ముడ్ని చూసా
ఆమ్మ గదిలో లేదే?
అమ్మ కోసం పరుగెట్టా
గది మధ్య అమ్మ పడుకొనుంది
తెల్ల దుప్పటి కప్పుకొనుంది
కదలకుండా కళ్ళు మూసుకొనుంది
నాన్నారు కదిలి కదిలి ఏడుస్తున్నారు
అమ్మ తమ్ముడ్ని మాకిచ్చేసి
వెళ్ళిపోయిందని వదిలేసి
అమ్మమ్మా ఏడ్చేసే
అయితే అమ్మ మళ్లీ రాదా?
భయమేసి పొట్టలో తిప్పుతుంది
తల్లో నొప్పెడుతుంది
అరుస్తూ ఏడుస్తున్నా
అమ్మేది? అమ్మ కావాలి!
ఈ తమ్ముడొద్దు, నాన్నారు!
వీడిని పంపేసి అమ్మనే తెండి నాన్నారు!
నాకమ్మే కావలి, ఈ తమ్ముడొద్దు!
గొంతు పోయేలా ఏడుస్తున్నా
నాన్నారి వొడిలో…
రచన : కోసూరి ఉమాభారతి